Asianet News TeluguAsianet News Telugu

బకార్డీ రమ్ - క్యూబా రెవల్యూషన్- క్యాస్ట్రో

  బకార్డీ రమ్ గురించి చాలా మందికి తెలియని సత్యం - అదొక  క్యూబన్ విప్లవ ప్రతిఘాతుక రమ్.  క్యా స్ట్రో ఈ రోజు చనిపోయారు. ఇపుడు విప్లవాన్నే కాదు, విప్లవ వ్యతిరేకులను కూడా గుర్తుకు తెచ్చుకొనక తప్పదు.

Bacardi rum and Cuban revolution

 

Bacardi rum and Cuban revolution

బకార్డి అనేది లైట్ , వైట్ రమ్ అని మాత్రమే చాలా మందికి తెలుసు. సాఫీగా, మృదువుగా గొంతులోకి జారుతూ నిదానంగా కైపెక్కిస్తూ,హాయిగా మత్తులోకి జారుతున్న  మజా బకార్డీ కల్గిస్తుంది. అందుకే అతితక్కువ కాలంలో కుర్రకారు డ్రీమ్ హార్సయి పోయిన మద్యం బకార్డీ.   అమెరికా సామ్రాజ్యం వాదంలాగానే కోల్డ్ వార్ కాలంలో బకార్డీ వైట్ రమ్ కూడా ప్రపంచ దేశాలన్నింటిని జయించింది. అయితే, ఒక్క చోటికి మాత్రం, అందులో కూడా విశాలభూగోళం మీద మట్టిబెడ్డంత సైజుకూడ లేని భూభాగం మీద మాత్రం కాలుమోప లేకపోయింది.  ఇందులో బకార్డీకి అమెరికాకి సామ్యం ఉంది. ఈ రెండుశక్తులు కూడా  బారెడు దూరాన నిలబడి భయభక్తులో చూస్తూ ఉండిన ఆ చిన్న భూబాగమేదో కాదు, క్యూబా.

 

బకార్డీ సిప్ చేసేముందు గుర్తుంచుకోండి, మొన్న మొన్నటి దాకా బకార్డీ ఒక విప్లవ వ్యతిరేక రమ్.

 

బకార్డీ రమ్ జన్మస్థానం క్యూబాయే నని చాలా మందికి తెలియదు. రమ్ తో ముడివడిన  క్యూబన్ సంగీత సంస్కృతికి ప్రాణంపోసింది  బకార్డీ రమ్. ఎపుడో వందేళ్ల కిందట  మొదట తయారయి క్రమంగా కుర్రకారు ఫేవరెట్ టిపుల్  అయి కూర్చుంది.  బకార్డీని క్యూబన్లు అంతగా ప్రేమించేందుకు కారణం, దీని  రసవాది ఎమిలియో బకార్డీ స్వాతంత్య్ర సమరయోధుడు కావడమే.స్పెయిన్ తో క్యూబా సాగించిన స్వాతంత్య్ర పోరాటంలో బకార్డీకుటుంబం అగ్రభాగాన ఉండింది. ఈ కాలంలో బకార్డీ కుటుంబం అనేక సార్లు జైలుపాలయ్యింది. తర్వాత, స్వాతంత్య్ర పోరాట కాలంలో సహాయం అందించినట్లే అందించి 1906లో ఈ భూభాగాన్ని అమెరికా తన అదుపులోకి  తెచ్చుకుంది. అందువల్ల ఆతర్వాత బాటిస్టా  ప్రభుత్వానికి వ్యతి రేకంగా కమ్యూనిస్టులు తిరగబడుతున్నపుడు కూడా బకార్డీ కుటుంబం విప్లవానికి అండగా నిలబడింది. రమ్ వ్యాపారంలో కోట్లకు పడగలెత్తినా క్యూబన్ చరిత్రలో బకార్డీకి ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం ఇదే.  ఇప్పటికీ ఇది మరపు రానిఘట్టమే.

 

క్యూబా చాలాకాలం ప్రపంచంలోనే సుసంపన్నమయిన వలస కేంద్రం. దీనికి కారణం విస్తారంగా పండే అక్కడి చెరకుపంటే.  క్యూబన్ రమ్ సంస్కృతిఈ చెరకు నుంచే వచ్చింది. చెరకు దేశాలలో  మెలాసెస్ నుంచి  మద్యం తయారుకాకపోవడం గమనించిన బకార్డీ చిల్లరంతా పోగేసి బకార్డీ రమ్ బట్టీ తెరిచాడు. క్యూబన్లకు మజా చూపించాడు.

 

బకార్డీజాతీయ వాదం క్యూబా కమ్యూనిస్టు విప్లవకాలంలో కూడా కొనసాగింది. ఫిడెల్ క్యాస్ట్రో సంస్థ M-26-7 కు భారీగా సహాయం అందించి  ఫుల్ జెన్షియో బాటిస్టా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూల్చేయడంలో   బకార్డీ కుటుంబం సహకారం మరువరానిది. అయితే, కమ్యూనిస్టు విప్లవం తర్వాత, క్యాస్ట్రో  ప్రభుత్వం ఎస్టేట్లను, కంపెనీలను  జాతీయీకరించడంతో ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి.   బకార్డీ కుటుంబం జాతీయీ కరణలో రమ్ వ్యాపారాన్ని  కోల్పోయింది.

 

ఈ దెబ్బకు బకార్డీ కుటుంబం తప్పించుకుని అమెరికా పారిపోయింది. తనతో పాటే బకార్డీ ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ లను న్యూయార్క్ కార్యాలయానికి తీసుకెళ్లిపోయింది. అప్పటికే బకార్డీ అంతర్జాతీయ వ్యాపారాలుచేసినందున,  మిగతా  పెద్దోళ్ల లాగా  ఈ కుటుంబం దివాళా తీయలేదు. అమెరికా వెళ్లాక బకార్డీ కొత్త చరిత్ర మొదలయ్యింది. వ్యాపారం భూజానేసుకున్న బకార్డీ అల్లుడు వైట్ రమ్ ని అంతర్జాతీయ డ్రింక్ గా మార్చేశాడు.

 

క్యాస్ట్రోకి బకార్డీకి వైషమ్యం తీవ్రం కావడానికి ఈ కుటుంబం సిఐఎ తో చేతులు కలపడమే కారణం. విప్లవ వ్యతిరేక శక్తులకు బకార్డీ భారీ గా  ధన సహాయం  చేయడం మొదలుపెట్టింది. అమెరికాకే కాదు, ప్రవాసం నుంచి  క్యాస్ట్రోని  కూలదోసేందుకు పనిచేసే సంస్థలన్నింటికి విరివిగా విరాళాలందించింది. క్యూబా  నుంచి బయటపడ్డాక బకార్డీ కుటుంబ సభ్యులు అమెరికాతోపాటు బెర్మడా, నాసావ్, మెక్సికో, స్పయిన్, కెనాడాలో స్థిరపడ్డారు.  అయితే, అనేక లీగల్ పోరాటాల ద్వారా బకార్డీ రమ్ బ్రాండ్ ను కాపాడుకోగలిగారు.

 

బకార్డీ క్యాస్ట్రో వ్యతిరేక విఫ్లవ ప్రతీఘాతక చర్యలు ఈ మధ్య దాకా సాగుతూ వచ్చాయని చెబుతారు. అంతేకాదు, క్యూబా నుంచి వచ్చే హవానా క్లబ్ రమ్ ని  ప్రపంచమంతా మార్కెట్ చేయడానికి ముందుకు వచ్చిన ఫ్రెంచ్ కంపెనీ ఫెర్నాడ్స్ మీద అమెరికా ఆంక్షలు విధించేలా బకార్డీ కంపెనీ వత్తి డి తీసుకువచ్చింది.  హావానా క్లబ్ రమ్ బ్రాండ్ ను కూడా  కాజేసేందుకు కూడా బకార్డీ క్యూబాను కోర్టుల కీడ్చింది. క్యూబా అదరలేదు, బెదర లేదు.

 

 క్యాస్ట్రో జబ్బు పడ్డాక, ఆయన తమ్ముడు అధికారంలోకి రావడం, క్యూబన్  వ్యవస్థలో మార్పులు వస్తూవుండటంలో బకార్డీ మాతృదేశంమీద మళ్లీ కాలుమోపుతుందని అనుకుంటున్నారు. ఇపుడు క్యాస్ట్రో చనిపోయారు కాబట్టి ఇంటిదారి పట్టడంఇంకా  సుళువు కావచ్చు.

 

 

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios