శ్రీకాకుళం జిల్లా మెట్టవలసలో సాత్విక అనే 18 నెలల చిన్నారి వీధి కుక్కల దాడిలో మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన పాపను రక్షించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన వీధి కుక్కల దాడులు, ఆయా ఘటనల్లో మరణించిన లేదా గాయపడిన వారి గురించి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కుక్కలను చూస్తే చాలు జనం పారిపోతున్నారు. వీధుల వెంట నడవాలంటేనే జనం వణుకుతున్నారు. వీధి కుక్కల సంగతి ఇలా వుంటే కొందరు వ్యక్తులే తమ పెంపుడు కుక్కలను జనం మీదకు వదులుతున్నారు. మొన్నామధ్య హైదరాబాద్ ఓ సీఐ అపార్ట్‌మెంట్ వాసుల మీదకు కుక్కలను ఉసిగొల్పిన ఘటన కలకలం రేపింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరగింది. వీధి కుక్కల దాడిలో చిన్నారి బలైపోయింది.
శ్రీకాకుళం జిల్లా మెట్టవలసలో సాత్విక అనే 18 నెలల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా.. వీధి కుక్కులు ఆమెను చుట్టుముట్టి దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆమె ఏడుపు విన్న కుటుంబ సభ్యులు వచ్చేసరికి చిన్నారిని కుక్కలు విచక్షణారహితంగా కరిచాయి. దీంతో సాత్వికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
