విజయవాడ ఆయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది.ఇటీవల తెనాలి చంచుపేటలో ఆయేషా మీరా మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం కూడా నిర్వహించారు.  ఈ క్రమంలో... ఆయేషా తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. 

అయేషా మీరా హత్య కేసును మొత్తం మాఫీ చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఆమె వ్యాఖ్యానించారు.  ఇప్పుడు ఆయన కొడుకు కొత్త చట్టం అంటున్నారని,  పోలీసులు, ప్రభుత్వం కేసులు పెట్టిన బాధితులనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని షంషాద్ బేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆడపిల్లలను కాపాడలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలిస్తే గాని భారతదేశం బాగుపడుతుందన్నారు. నేటి సమాజంలో తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదని, విద్య సంస్థలు సరిగా లేవని, రాజకీయ వ్యవస్థ సరిగా లేదని షంషాద్ బేగం తెలిపారు. 

కాగా... ఆమె ఇటీవల నగరి ఎమ్మెల్యే రోజాపై కూడా విమర్శలు చేశారు. తన కూతురు హత్య జరిగిన సమయంలో రోజా చాలా హడావిడి చేశారని... ఇప్పుడు మాత్రం నోరు విప్పడం లేదని  ఆయేషా మీరా తల్లి పేర్కొన్నారు. తన బిడ్డను హత్య చేసిన నిందితులు ఎవరో ఎమ్మెల్యే రోజా కి తెలుసంటూ ఆమె సంచలన కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకువస్తూ... మహిళలపై అత్యాచారం జరిగితే కేవలం 21 రోజుల్లో నిందితులను పట్టుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయేషా కేసును కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు.

ఇప్పటికీ తమకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. నిందితుల పేర్లు బయటపెడుతుంటే.. మా పై రూ.కోటి పరువు నష్టం కేసు వేస్తామని బెదిరిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిజా నిజాలు బయటపెడితే... ఎవరు పరువు నష్టం చెల్లించాల్సి వస్తుందో తెలుస్తుందన్నారు.

2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు. ఈ హత్య జరిగినప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.