చిత్తూరు: నగరి నియోజకవర్గంలో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా కీలక నిర్ణయం ప్రకటించారు. 2020 నాటికి ప్లాస్టిక్ ను పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో ఆమె వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు అందించండి కీలో నాణ్యమైన బియ్యం పట్టుకెళ్లండి అంటూ ఆఫర్ ప్రకటించారు రోజా. తన పుట్టిన రోజు సందర్భంగా నగరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన ప్రతీ పుట్టిన రోజు నాడు ఏదో ఒక కార్యక్రమంతో వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. 

గతంలో తన పుట్టిన రోజు నాడు మెగా జాబ్ మేళా నిర్వహించానని అలాగే గత ఏడాది పుట్టిన రోజున వైయస్ఆర్ క్యాంటీన్ ను ప్రారంభించామని అది ఇప్పటికీ కొనసాగుతుందని రోజా స్పష్టం చేశారు. 

ఈసారి తన పుట్టినరోజు సందర్భంగా అవాయిడ్ ప్లాస్టిక్స్, సేవ్ నేచర్ అనే నినాదంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రోజా తెలిపారు. మంచి వాతావరణ భావితరానికి అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు దాదాపుగా 400 సంవత్సరాలు పడుతుందని చెప్పుకొచ్చారు. అంటే 16 తరాల వరకు ప్లాస్టిక్ భూతం వేధిస్తోందని చెప్పుకొచ్చారు. విషకరమైన ప్లాస్టిక్ ను నివారించాలన్న లక్ష్యంతో ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎంత ప్లాస్టిక్ వ్యర్థాలు అందిస్తే అంత బియ్యాన్ని తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమం సీఎం జగన్ పుట్టిన రోజు వరకు కొనసాగుతుందని రోజా ప్రకటించారు. ఇకపోతే నగరి నియోజకవర్గాన్ని హానికర ప్లాస్టిక్ వ్యర్ధాలు లేని స్వచ్ఛ నగరిగా మారుద్దామని అందుకు అంతా కలిసిరావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం నిర్మూలిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, అందరికీ ఆదర్శంగా నిలుద్ధామంటూ రోజా నియోజకవర్గ ప్రజలకు పిలుపు టిచ్చారు. 

ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని పీడిస్తోందని రోజా స్పష్టం చేశారు. ప్రపంచంలోని చాలా దేశాలు ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ప్రకటిస్తున్నాయని త్వరలో మన దేశం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రజలంతా కలిసి రావాలని కోరారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని రోజా ప్రశంసించారు. నవరత్నాలతోపాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని కొనియాడారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సగానికిపైగా పూర్తి చేసిన ఘనత వైయస్ జగన్ కే దక్కుతుందని తెలిపారు. అలాగే అనేక సంస్కరణలతో జగన్ ప్రజలనోట శభాష్ అనిపించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ అహర్నిశలు పాటుపడుతున్నారని తెలిపారు. 

ఇలాంటి కార్యక్రమాన్ని హైదరాబాద్ బోడుప్పల్ కార్పోరేషన్‌ పరిధిలో చేపట్టారు. కిలో ప్లాస్టిక్‌ ఇవ్వండి బదులుగా కిలో బియ్యం లేదా 6 కోడిగుడ్లు తీసుకెళ్ళండి అని ప్లాస్టిక్‌ రహిత బోడుప్పల్‌ నిర్మాణం కోసం దేవరకొండ వెంకటాచారి, మామిడాల ప్రశాంత్‌ మరియు సాయిని నవీన్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  

వారి పిలుపు మేరకు సుమారు 60 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను వారు సేకరించారు. అందుకు బదులుగా 60 కిలోల బియ్యాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా సినీనటి, ఎమ్మెల్యే రోజా కూడా ఇదే తరహా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

 ఈ వార్తలు కూడా చదవండి

మీడియం రగడ: చంద్రబాబు, పవన్ లపై రోజా ఆగ్రహం