చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దోళ్ల పిల్లలే ఇంగ్లీషు మీడియంలో చదవాలా పేదోళ్ల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవకూడదా అంటూ నిలదీశారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తప్పేంటని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని స్వాగతించాల్సింది పోయి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం బాధాకరమన్నారు. 

చంద్రబాబు నాయుడు పిల్లలు, మనవళ్లు, పవన్ కళ్యాణ్ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు కానీ పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోకూడదా అని నిలదీశారు. విద్యారంగం బలోపేతం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని తెలిపారు. 

ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు. అందుకు సంతోషించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టి తీరుతామని తెగేసి చెప్పారు సీఎం జగన్. ఒంగోలులో నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచంతో పోటీ పడలేక, ప్రైవేట్ స్కూల్లో చదివే స్తోమత లేక పేదపిల్లలు కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. కనీసం డ్రైవర్లుగా కూడా పనిచేసే అవకాశం లేదని తెలిపారు. ఎందుకంటే డ్రైవర్లు లేని కార్లు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. 

విద్యావ్యవస్థలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకురావాలని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు. తాను విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే తనను టార్గెట్ చేస్తూ కొందరు రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

సినీనటులు, రాజకీయ నాయకులు, భారత ఉపరాష్ట్రపతి లాంటివంటి వారు సైతం తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మనవళ్లు, మీ కుటుంబ సభ్యులు పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదువుకోవాలా నిరుపేదల పిల్లలు చదువుకోవద్దా అని నిలదీశారు. నిజాయితీగా ఆలోచించి వాస్తవాలు గమనించాలన్నారు. 

దొంగలు సైతం ఎత్తుకోపోలేని ఆస్తి, చదువు ఒక్కటే నిజమైన సంపద అంటూ సీఎం జగన్ అభివర్ణించారు. విద్యార్థులు బాగా చదువుకుంటే కలెక్టర్లుగానూ, ఇంజనీర్లుగానూ ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకే నా ? పేద పిల్లలకు వద్దా..!: సీఎం జగన్