పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నోటిఫికేషన్ నాటి నుంచి రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నిక వేళ పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
KNOW
మొదలైన ఓటింగ్
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికను వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి మధ్య పోటీ హోరాహోరీగా మారింది. మొత్తం 10,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
పోలింగ్ ప్రారంభానికి ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ఆయన ఇంటిని సోమవారం రాత్రి నుంచే ముట్టడి చేసిన పోలీసులు, ఉదయం ఆరు గంటల సమయంలో అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే అవకాశం ఉందన్న సమాచారం ఆధారంగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు సమయంలో అవినాష్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ చర్యను అక్రమమని పేర్కొన్నారు.
ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం
అరెస్టు సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. తనకు జ్వరం ఉందని, ఇంట్లోనే ఉంటానని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకుని అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని కూడా బలవంతంగా వెనక్కు నెట్టివేయడంతో ఇంటి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.
భద్రతా ఏర్పాట్లు, కట్టుదిట్టమైన బందోబస్తు
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు మండలాల్లో మొత్తం 1,500 మంది పోలీసులను మోహరించారు. వెబ్‌కాస్టింగ్ సదుపాయంతో పాటు, డ్రోన్లు, మొబైల్ సర్వైలెన్స్ వాహనాలు వినియోగించారు. వెబ్‌కాస్టింగ్ లేని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు. అదనంగా, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు.
కీలకంగా మారిన ఎన్నిక
ఈ ఉప ఎన్నికలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హేమంత్ రెడ్డి (వైసీపీ) – మారెడ్డి లతారెడ్డి (టీడీపీ) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ కూడా అభ్యర్థిగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక కావడంతో, ఈ ఫలితం రెండు పార్టీల ప్రతిష్టకే కాకుండా, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపనుంది.
