ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై గతనెలలో విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. నిందితుడు శ్రీనివాస్ విషయంలో పోలీసులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు శ్రీనివాస్ ని మరోసారి కష్టడీకి అప్పగించాలని పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నారు.

గతనెల 25వ తేదీన జగన్ పై దాడి జరగగా ఆ రోజు విచారించి...26వ తేదీన అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. కేసులో మరింత సమాచారం నిందితుడి నుంచి రాబట్టాల్సి ఉన్న నేపథ్యంలో శ్రీనివాస్ ని తమ కష్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్ వేయడంతో ఆరు రోజుల కష్టడీకి అనుమతించింది.

గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు ఆరు రోజులపాటు శ్రీనివాస్ తోపాటు, అతని కుటుంబసభ్యులు, స్నేహితులు, సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా మరికొంతమందిని ఇలా ఇప్పటి వరకు 321మందిని విచారించారు. అయితే.. శ్రీనివాస్ చెబుతున్న కొన్ని విషయాలు నమ్మసక్యంగా లేకపోవడంతో.. అతనిని విచారించేందుకు మరింత సమయం కావాలని పోలీసులు భావిస్తున్నారు.

ఈమేరకు ఈ నెల 2న కోర్టులో పిటిషన్ వేయగా..న్యాయస్థానం తిరస్కరించింది. కాగా.. సోమవారం మరోసారి పిటిషన్ వేయాలని భావిస్తున్నారు.