రమేష్ ఆస్పత్రి నుంచి ఎన్నారై అస్పత్రికి అచ్చెన్నాయుడు
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని రమేష్ ఆస్పత్రి నుంచి మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించనున్నారు. అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించనున్నారు. గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదుల సూచనతో ఎన్నారై ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అచ్చెన్నాయుడికి ప్రత్యేకమైన గదిలో చికిత్స అందించాలని సూచించింది.
అచ్చెన్నాయుడికి ఇటీవల కరోనా సోకింది. ఈ విషయాన్ని రమేష్ ఆస్పత్రి వర్గాలు హైకోర్టుకు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఆయనను ఎన్నారై ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడిని ఎసిబీ అధికారులు అరెస్టు చేశారు. జూన్ 12వ తేదీన స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన తర్వాత ఆయనకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. అచ్చెన్నాయుడి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆయనను రమేష్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.