పల్నాడు జిల్లా దాచేపల్లిలో టిడిపి నాయకుడు కానిశెట్టి నాగులు ఇంటిపై దాడి నేపథ్యంలో వైసిపి శ్రేణులకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
గుంటూరు: పల్నాడు జిల్లా దాచేపల్లిలో టిడిపి నాయకుడు కానిశెట్టి నాగులు ఇంటిపై వైసిపి శ్రేణులు దాడిచేయడంపై ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికార మదంతో వైసీపీ రౌడీమూకలు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే... ఇప్పుడు ఎక్స్ ట్రాలు చేస్తున్న వైసీపీ రౌడీ మూకలకు తప్పకుండా రిటర్న్ గిప్ట్ ఇస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
''రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తల తీరు యధా రాజా తధా ప్రజా అన్నట్టుగా తయారైంది. పొద్దున్న లేస్తే ఎవరి ఆస్తులు విధ్వంసం చేద్దాం, ఎవరిపై అక్రమ కేసులు పెడదామా... అని ఓ వైపు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. మరో వైపు వైసీపీ కార్యకర్తలు ఎవరిపై దాడి చేద్దాం, ఎవరి ప్రాణాలు తీద్దాం, ఎవరి ఆస్తులు లాక్కుందామా అని ఆలోచిస్తున్నారు. అంతేతప్ప వైసిపి నాయకులెవ్వరూ ప్రజలకేం చేద్దామన్న ద్యాస ఏమాత్రం లేదు. రాష్ట్రంలో వైసీపీ గూండాల అరాచకాలకు, ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతోంది'' అని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేసారు.
''పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త కానిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ గూండాల దాడిని తీవ్రం గా ఖండిస్తున్నాం. నాగులు కుటుంబ సభ్యులపైనే కాక ఇంటి ఆవరణలో ఉన్న పశువులపై కూడా దాడి చేశారంటే వైసీపీ గూండాలు పశువుల కన్నా హీనంగా తయారయ్యారని స్పష్టం అవుతోంది. నోరు లేని మూగజీవాలపై సైతం దాడికి పాల్పడటం హేయమైన చర్య'' అన్నారు.
''దాచేపల్లి మున్సిపల్ ఛైర్మన్ మునగ రమాదేవి భర్త, కుమారులు, బంధువులే నాగులు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో వైసీపీ రౌడీ మూకలు అల్లర్లు, అరాచకాలకు తెగబడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నాగులు ఇంటిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేసారు.
''తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు. 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే... ప్రస్తుతం అధికార మదంతో అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ రౌడీ మూకలకు రిటర్న్ గిప్ట్ ఇస్తాం. తీసుకునేందుకు వారు సిద్దంగా ఉండాలి'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే:
పల్నాడు జిల్లా దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కానిశెట్టి నాగులు ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేశారు. పాతకక్షల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆదివారం అర్ధరాత్రి నాగులు ఇంటివద్దకు చేరుకుని దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ భర్త , కుమారులు మూకుమ్మడిగా తమ ఇంటిపై దాడికి పాల్పడ్డారని కానిశెట్టి నాగులు తెలిపారు. ఈ దాడిలో నాగులు ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసమైందని చెప్పారు. ప్రాణభయంతో ఇంట్లోకెళ్లి తాళాలు వేసుకోవడంతో.. ఇంటి ఆవరణలో ఉన్న పశువులపై దాడి చేశారని ఆరోపించారు. నాగులు ఏడునెలల కూతురిపై పెట్రోల్ పోసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు.
పోలీసులు రావడంతో వారు తన ఇంటి వద్ద నుంచి వెళ్లిపోయారని నాగులు చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయలేదనే కక్షతోనే నిందితులు తమ ఇంటిపై దాడి చేశారని నాగులు చెబుతున్నారు. గతంలో కూడా బెదిరింపులకు పాల్పడినట్టుగా చెప్పారు.
