శ్రీకాకుళం: పాలేశ్వరస్వామి నంది విగ్రహం కేసుతో తనకు సంబంధం లేకున్నా పోలీసులు నోటీసులిచ్చారని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు.

పాలేశ్వరస్వామి  నంది విగ్రహం వివాదం కేసులో కాశీబుగ్గ డీఎస్పీ ఎదుట గురువారం నాడు  ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాలేశ్వరస్వామి నంది విగ్రహం కేసు విషయమై నిన్న తనకు విశాఖలో పోలీసులు నోటీసులిచ్చారన్నారు.

చట్టంపై గౌరవంతో సమాధానం ఇచ్చినట్టుగా చెప్పారు. భవిష్యత్తులో కూడ విచారణకు సహకరిస్తానని ఆయన చెప్పారు.ఈ కేసుతో సంబంధం లేకున్నా కూడ  నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. ఎఫ్ఐఆర్ లో గానీ, రిమాండ్ రిపోర్టులో గానీ తన పేరు లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనతో పాటు చాలా మంది టీడీపీ నేతల పేర్లను ఈ కేసులో చేర్చారని ఆయన తెలిపారు.