Chandrababu Naidu bail : తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు.. అచ్చెన్నాయుడు
జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటు. అక్రమ కేసులు వాదించేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.

అమరావతి : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై, ఆ తరువాత మధ్యంతర బెయిలుపై బయటికి వచ్చిన చంద్రబాబునాయుడికి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరం అన్నారు అచ్చెన్నాయుడు. న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడాం అన్నారు. తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలని అన్నారు. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి.
జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటు. అక్రమ కేసులు వాదించేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. జగన్ రెడ్డి నియంతపాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు గారు త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
Breaking News : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్
అంతకు ముందు రెగ్యులర్ బెయిల్ మీద తీర్పు నిచ్చే క్రమంలో న్యాయస్థానం... స్కిల్ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారని హైకోర్టు పేర్కొంది. అరెస్టుకు కొద్దిరోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నది. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం కూడా లేదని పేర్కొంది. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరిలో ఎన్ఎస్‌జీ భద్రతలో ఉన్నారని తెలిపింది. కేసు విచారణ నుంచి చంద్రబాబు తప్పించుకునే అవకాశం లేదని, కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశం లేదని చెప్పుకొచ్చింది.
సీమెన్స్ డైరెక్టర్, డిజైన్ టెక్ యజమాని వాట్సప్ సందేశాలకు, చంద్రబాబుకు సంబంధం ఏంటని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. సీమెన్స్ తో ఒప్పందంలో సుమన్ బోస్ పేరుతో సంతకం ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, సంతకాలు పరిశీలించే బాధ్యత సీఎంది కాదని హైకోర్టు తెలిసింది. సంతకంపై అభ్యంతరాలుంటే ఫోరెన్సిక్ విభాగం తేలుస్తుందని చెప్పుకొచ్చింది. గత ప్రభుత్వ హయాంలోనే అక్రమ లావాదేవీలు జరిగాయనేందుకు ఆధారాలు లేవని హైకోర్టు పేర్కొంది. ఐటీశాఖ విచారణలో చంద్రబాబు పాత్ర ఉందన్న వాదనలకు ఆధారాలు లేవని చెబుతూ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.