గుంటూరు:ఎసిబి అధికారులు అరెస్ట్ చేసిన మంత్రి అచ్చెన్నాయుడిని కలిసేందుకు ఇంటినుండి బయలుదేరిన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను అడ్డుకున్నారు. ఆయన ఇంట్లోంచి బయటకు రాకుండా గేటును మూసివేశారు. ఆయన ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా గృహనిర్భందం విధించారు. 

బయటకు వెళ్లి కేవలం అచ్చెన్నాయుడికి  సంఘీభావం చెప్పి  వస్తానని చెప్పినా రామయ్యను  పోలీసులు వదలలేదు. దీంతో కాస్సేపు రామయ్యకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెదేపా నాయకులతో మాట్లాడే స్వేచ్చ కూడా తమకు లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏసీబీ ఆఫీసుకు తీసుకు వస్తున్న అచ్చెనాయుడితో మాట్లాడి వస్తానని చెప్పి వెళ్ళనీయండని విజ్ఞప్తి చేసినా పోలీసులు ఖాతరు చేయలేదని రామయ్య అన్నారు.  ఉన్నతాధికారులతో ఫోన్ లో సంప్రదించినా అంగీకరించలేదని... తనను ఇంట్లోంచి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని రామయ్య తెలిపారు.

read more   జగన్ ను అరెస్టు చేస్తే సంబరాలు: అచ్చెన్న అరెస్టుపై హోం మంత్రి సుచరిత

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలంలోని సొంత గ్రామం నిమ్మాడలో టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ కుంభకోణం జరగడం... ఈ స్కాంతో ఆయనకు సంబంధాలున్నట్లు తేలడంతో ఏసిబి పోలీసులుఅరెస్ట్ చేసినట్లు సమాచారం. 

భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. అచ్చెన్నాయుడు సిఫార్సుల కారణంగానే అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టీడీఎల్పీ) ఉప నేతగా ఆయన ఉన్నారు. శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడి అరెస్టు జరిగిందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. 

అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.988 కోట్ల  మెడికల్ సామాగ్రి కొనుగోళ్లు జరిగాయని, ఇందులో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు గుర్తించారు. అచ్చెన్నాయుడు సిఫార్సు మేరకు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.  

మరో మాజీ మంత్రి పాత్ర కూడా ఈసీఐ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.  అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మొత్తం 40 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మందులు, పరికరాలు,ల్యాబ్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. నకిలీ కొటేషన్లతో వ్యవహారం నడిపినట్లు తేలింది. కొనుగోళ్ల టెండరింగులో అచ్చెన్నాయుడి కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి.