తమ పార్టీకి చెందిన నాయకులను అధికార వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కావాలనే అరెస్టు చేయిస్తోందని టీడీపీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. 

కక్ష సాధింపు చ‌ర్య‌లో భాగమే అశోక్ బాబు అరెస్టు అని టీడీపీ నాయ‌కుడు కొమ్మారెడ్డి పట్టాభిరాం (kommareddy pattabhiram) అన్నారు. ప్రభుత్వం సంకట స్థితిలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్డడం స‌ర్వ సాధార‌ణం అయిపోయింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రివర్స్ పీఆర్సీ తో మోసం చేసిన ప్రభుత్వ విధానాల్ని ఎండ‌గ‌ట్ట‌డ‌మే అశోక్ బాబు (ashok babu) చేసిన త‌ప్పా అని ప్ర‌శ్నించారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా, సమైక్య ఆంధ్ర జేఏసీ చైర్మన్ గా అశోక్ బాబు ఉద్యోగుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటం చేశార‌ని అన్నారు. మూడేళ్లుగా టీడీపీ ఎమ్మెల్సీగా, శాసన మండలిలో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నార‌ని తెలిపారు. 

జ‌న‌వ‌రి 24వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు అశోక్ బాబుపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశార‌ని కొమ్మారెడ్డి పట్టాభిరాం తెలిపారు. అదే రోజు ఉద‌యం ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 6 నుంచి స‌మ్మెకు వెళ్తామ‌ని ప్ర‌భుత్వానికి నోటీసు ఇచ్చార‌ని తెలిపారు. రివర్స్ పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్నఉద్యమం సమ్మె నోటీసుతో కీలక ఘట్టానికి చేరుకున్న రోజునే.. ఉద్యోగుల హక్కుల కోసం ప్రతినిత్యం పోరాటం చేసిన మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిపై కేసు నమోదు చేయడం దుర్మార్గ‌మ‌ని అన్నారు. ఇది ప్రశ్నించే గొంతులకు ముందుగానే తాళం వేసే ప్ర‌య‌త్నం అని తెలిపారు. 

తప్పుడు పనులు చేయడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి (cm jagan mohan reddy) ఉన్న టైమింగ్ ఎవరికీ ఉండద‌ని ఆయ‌న అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఐడీ ప్రభుత్వ తోలు బొమ్మగా మారిపోయింద‌ని ఆరోపించారు. సీఐడీ జనవరి 24న అశోక్ బాబుపై సీఐడీ 477ఏ, 465, 420 రెడ్ విత్ 34 ఐపీసీ అనే మూడు సెక్షన్ల కింద కేసు పెట్టార‌ని అన్నారు. ఫిబ్రవరి 10 వ తేదీ అర్ధ‌రాత్రి అరెస్టు సమాచారం అని చెప్పి అశోక్ బాబు ఇంటికి అంటించిన నోటీసుల్లో 7 సెక్షన్లు పెట్టారు. జనవరిలో న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ కు, ఫిబ్రవరిలో న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ కి అమాంతం 4 సెక్షన్లు వచ్చి చేరాయ‌ని విమ‌ర్శించారు. 466, 467, 468, 471 అనే సెక్షన్లు కొత్త‌గా వ‌చ్చి చేరాయ‌ని అన్నారు. సెక్షన్ 467 కి అత్యధికంగా శిక్ష పడే కాలం 10 సంవత్సరాలు ఉంటుంద‌ని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్షపడే సెక్షన్లకు 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసే వీలు లేద‌ని చెప్పారు. 41ఏ నోటీసు నిబంధన నుంచి తప్పించుకోవడానికి అశోక్ బాబుపై అదనంగా మరో నాలుగు సెక్షన్లు పెట్టార‌ని ఆరోపించారు. మరీ ముఖ్యంగా 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ 467 ను చేర్చార‌ని దుయ్య‌బ‌ట్టారు. 

కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ (commercial tax department)లో పనిచేస్తున్నప్పుడు అశోక్ బాబు తప్పుడు బీకాం (bcom)సర్టిఫికేట్ ఉపయోగించారని ఆయనపై ఆరోపణలు చేస్తున్నార‌ని కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ఎమ్మెల్సీ అఫిడవిట్ లో ఆయ‌న విద్యార్హ‌త‌లు ఇంటర్మీడియట్ స్ప‌ష్టంగా చెప్పార‌ని తెలిపారు. ఆయ‌న డిగ్రీ హోల్డర్ అని ఎప్పుడూ చెప్పుకోలేదని గుర్తు చేశారు. సీఐడీ చేస్తున్న ఆరోపణలకు పెట్టిన సెక్షన్లకు ఎలాంటి సంబంధం లేద‌ని అన్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌జలు అర్థం చేసుకోవాల‌ని చెప్పారు. ఆయ‌న త‌రుఫున టీడీపీ న్యాయ పోరాటం చేస్తుంద‌ని, ఆయ‌న నిర్దోషిగా బయ‌ట‌కు వ‌స్తార‌ని తెలిపారు.