గుడివాడ : తెలుగుదేశం పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై తెలుగుయువత అధ్యక్షుడు, గుడివాడ అభ్యర్థి దేవినేని అవినాష్ స్పందించారు. తాను టీడీపీకి గుడ్ బై చెప్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. 

ప్రాణం ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు దేవినేని అవినాశ్‌ స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అవినాష్ ఇకపై నిత్యం గుడివాడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. 

ప్రజాసేవ చేయడానికి పదవులు అక్కర్లేదని, చిత్తశుద్ధి ఉంటే చాలునని చెప్పుకొచ్చారు. పదవులకు ఆశపడి తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని చంద్రబాబు నిర్ణయాలు నచ్చే టీడీపీలో చేరానని తెలిపారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానే తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం కాదన్నారు. 

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతినెలా 9వ తేదీ వరకూ ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, అలాగే ప్రతినెలా మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. 

ఈనెల 14న నందివాడ, గుడివాడ పట్టణ కమిటీల సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.  

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంసిద్దులు కావాలని కోరారు. గుడివాడలో టీడీపీ పూర్వ వైభవానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని దేవినేని అవినాష్ సూచించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

కృష్ణాలో చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి టీడీపీ యువనేత