Asianet News TeluguAsianet News Telugu

కృష్ణాలో చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి టీడీపీ యువనేత

తెలుగు యువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడు దేవినేని అవినాశ్ తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర మనస్థాపం చెందిన దేవినేని నెహ్రూ ఇక టీడీపీలో ఇమడలేకపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే జగన్ గూటికి చేరుతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

devineni avinash angry with tdp, likely join to ysrcp
Author
Amaravathi, First Published Aug 5, 2019, 8:32 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుందా...అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడకు చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పార్టీ వీడతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం మరవకముందే మరో యువనేత పార్టీకి గుడ్ బై చెప్పారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 

తెలుగు యువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడు దేవినేని అవినాశ్ తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర మనస్థాపం చెందిన దేవినేని నెహ్రూ ఇక టీడీపీలో ఇమడలేకపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే జగన్ గూటికి చేరుతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే సమీప ప్రత్యర్థి, మంత్రి కొడాలి నాని చేతిలో పరాజయం పాలయ్యారు. పరాజయం పాలైనప్పటికీ తన వానిని వినిపిస్తూనే ఉన్నారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలు సైతం చేశారు దేవినేని అవినాష్. అయితే తెలుగుదేశం పార్టీలో తనకు సముచిత గౌరవం ఇవ్వడం లేదంటూ ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. 

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు తనను పక్కన పెట్టారని ఆయన భావిస్తున్నారట. గతంలో నారా లోకేష్ తనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని బహిరంగంగానే విమర్శించారు. 

నారా లోకేష్ తనను పట్టించుకోవడం లేదని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఓటమి తర్వాత కూడా అటు చంద్రబాబు నాయుడు గానీ లోకేష్ గానీ అసలు తనను గుర్తించడం లేదని తన అనుచరులు వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  విదేశాలకు వెళ్లి అమరావతి వచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయం వెళ్లినప్పుడు తనవైపు చూడకుండా, పట్టించుకోకుండా వ్యవహరించారని బాధపడుతున్నారట. 

తన అధినేతలను గౌరవించాలని తాను వెళ్తుంటే వారు తనను పట్టించుకోవడం లేదని తనకంటే మదనపడుతున్నారట. ఇలా రెండు సార్లు పరాభవం ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే చంద్రబాబును రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన దేవినేని అవినాష్ ను చంద్రబాబు గానీ ఆయన తనయుడు లోకేష్ గానీ పట్టించుకోలేదట. 

తాను ఉన్నా తనను కాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కారులో వెళ్లిపోయారని కనీసం ఒక్కసారైనా తనను వారితో కలుపుకోవడం గానీ లేదా తనతో రావడం గానీ చేయడం లేదని ఇది చూస్తుంటే తనను పక్కన పెట్టినట్లు తెలుస్తోందని భావిస్తున్నారట. 

పార్టీలో దేవినేని అవినాష్ కు జరుగుతున్న వరుస పరాభవాలతో ఆయన అనుచరులు, అభిమానులు సైతం పార్టీలో ఉండేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

మరోవైపు గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీ చేయడం దేవినేని అవినాష్ కు అంతగా ఇష్టం లేదని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి లేదా పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. 

అయితే అందుకు చంద్రబాబు నాయుడు ససేమిరా అన్నారు. గుడివాడలో కొడాలి నానిని ఢీ కొట్టే సత్తా అవినాశ్ కు మాత్రమే ఉందని చెప్పి ఆ టికెట్ ఇచ్చారు. అసంతృప్తితో అయినా సరే వెళ్లి పోటీ చేశారు. మంత్రి కొడాలి నాని చేతిలో పరాజయం పాలయ్యారు. 

పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేవినేని అవినాష్ కొద్దిరోజులుగా పార్టీ కార్య‌క‌ల‌పాల‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఇక టీడీపీ వీడాల‌ని అవినాశ్ నిర్ణ‌యించుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణపై ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. 

ఇకపోతే మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడుతో పార్టీలో జరుగుతున్న పరిణామాలు నియోజకవర్గం మార్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు లేదా పెనమలూరు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై చంద్రబాబుతో చర్చించి అమితుమీ తేల్చుకోనున్నట్లు సమాచారం.  

చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీని బట్టి ఆయన పార్టీలో ఉండాలా వద్దా అనేది దేవినేని అవినాష్ తన నిర్ణయం ప్రకటించనున్నారు. ఇకపోతే ఇప్పటికే వైసీపీలో చేరే అంశంపై చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం విదేశాల నుంచి సీఎం వైయస్ జగన్ అమరావతి చేరుకున్నారు. సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అవినాష్ వైసీపీలో చేరతారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios