YS Sharmila: రేవంత్‌తో షర్మిల భేటీ.. వైసీపీలో కలవరం.. భారీ మూల్యం తప్పదా?
వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డితో భేటీ కావడంపై వైసీపీ శిబిరంలో ఆందోళన మొదలైంది. నిజంగానే వీరిద్దరూ కలిసి ఏపీ కాంగ్రెస్ ఓటు శాతాన్ని పెంచితే అది పరోక్షంగా వైసీపీ ఓటమికి పునాది వేసినట్టే అవుతుందనే కలవరం మొదలైంది.
YSR Congress Party: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగేవి. కానీ, 2018లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లింది. దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. వెనుక జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా ఓ పాత్ర పోషించినట్టు చర్చ జరిగింది. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ తన వంతు పాత్ర పోషించిందని చెబుతుంటారు. హైదరాబాద్‌లో ఉన్న నాయకుల ఆస్తులను చూపి టీడీపీ నేతలను టీఆర్ఎస్ హద్దులో పెట్టినట్టు చర్చిస్తుంటారు. అయితే, 2023లో తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. జగన్ మోహన్ రెడ్డికి ఆ సహకారం ఎప్పట్లాగే కొనసాగేదనే అంచనాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి.
తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నది. ఏపీలో వైఎస్ జగన్‌కు సహాయం అందించే పరిస్థితులు చాలా తక్కువ. జగన్‌కు మరో సమస్య చెల్లిరూపంలో ఎదురైంది. వైఎస్ షర్మిల రెడ్డి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల పై కంటే సీఎం జగన్ పైనే తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. షర్మిల ఇటీవలే హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిశారు. సీఎం జగన్ రెడ్డితో కాసేపు చర్చించారు. ఈ భేటీపై వైసీపీలో మరో కలవరం మొదలైంది. టీడీపీకి రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయనే చర్చ ఉండనే ఉన్నది. ఒక వేళ రేవంత్ రెడ్డి టీడీపీకి మేలు చేయాలని తలిస్తే వైసీపీకి ఇబ్బందులు తప్పవు. ఏపీ కాంగ్రెస్‌లో పునరుత్తేజం తేవడానికి షర్మిల కష్టపడుతున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పునర్వైభవానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు కూడా. ఇది కూడా వైసీపీకి మింగుడుపడటం లేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ ఓటు షేరు 2.8 శాతం మాత్రమే. ఒక వేళ కాంగ్రెస్ కష్టపడితే కనీసం 5 శాతానికి ఈ ఓటు షేరు పెంచుకున్నా అది వైసీపీకి భారీ మూల్యంగా తప్పని పరిస్థితి. ఆ మాత్రం ఓటు షేరు వైసీపీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఎందుకంటే వైసీపీ ఓటర్లు దాదాపుగా కాంగ్రెస్ ఓటర్లే. ఇది పరోక్షంగా టీడీపీకి కలిసి వస్తుంది. అంటే.. అటు వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ మెరుగుపడిందనే క్రెడిట్ రావడమే కాదు.. రేవంత్ రెడ్డి సహకారంతో టీడీపీ గెలిచిందనే క్రెడిట్ కూడా రాకపోదు. వాస్తవానికి ఈ వ్యవహారం వైసీపీ శిబిరంలో కలవరాన్ని కలిగిస్తున్నది.