గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ఆర్మీ జవాను తన ప్రియురాలి తల్లిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కాగా... ఆ తుపాకీ తూటాల నుంచి సదరు మహిళ స్వల్పగాయాలతో బయటపడగా.. ఆ జవాను పరారయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన సైనిక ఉద్యోగి బాలాజీ నడంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయంలో.. సదరు యువతి వెంట చాలా కాలం నుంచి పడుతున్నాడు. అయితే.. అతని ప్రేమను ఆమె, ఆమె కుటుంబసభ్యులు అంగీకరించలేదు.

అయినా.. అతను పట్టువదలని విక్రమార్కుడిలా వెంటపడుతుంటే.. కొద్దిరోజుల క్రితం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తన ప్రేమను ఒప్పుకోకపోగా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అని కోపం పెంచుకున్నాడు.  ఈ క్రమంలో శనివారం ఉదయం బాలాజీ తుపాకీ  చేత పట్టుకొని ప్రియురాలి ఇంటి వద్దకు చేరుకున్నాడు.

Also Read భార్య చెల్లిపై కన్నేసి బావ.. నగ్నంగా ఫోటోలు తీసి.. పదేళ్లుగా నరకం....

ఇంటి తలుపులు గట్టిగా బాదాడు. ఎవరు వచ్చారా అని యువతి తల్లి తలుపులు తీయడానికి వచ్చింది. దీంతో.. ఆమెపై కాల్పులు జరిపాడు. ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన ఆమె తలుపు పక్కకు దాక్కుంది. దీంతో.. చెవికి స్వల్పంగా గాయమైంది.

తీవ్ర భయాందోళనకు గురైన ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే పరుగున వచ్చి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే... బాలాజీ అక్కడి నుంచి పరారయ్యాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీ, బ్యాగుని అక్కడే వదిలేసి పారిపోయాడు.  కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.