తిరుమలలో భక్తులకు చేతికర్రలు ఇచ్చి పులుల బారి నుంచి తప్పించుకోవాలని చెప్పడంపై చంద్రబాబు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. శ్రీవారిని దర్శించుకున్నట్టు లేదని, పులలు కోసమే అక్కడికి వెళ్లుతున్నట్టు ఉన్నదని పేర్కొన్నారు.
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద గత కొన్ని రోజులు పులుల సంచారం కలకలం రేపుతున్నది. ఓ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాక పరిస్థితులు గంభీరంగా మారాయి. పులుల నుంచి భక్తులు తమను తాము రక్షించుకోవడానికి కొన్ని నిబంధనలు పాటించాలని అధికారులు చెప్పారు. అందులో ఒక నిబంధన కర్రలు పట్టుకుని నడవాలని ఉన్నది. ఈ నిబంధన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది. కేవలం కర్రలతో పులిని బెదిరించి పంపిచేయొచ్చా? కర్రలు పులుల నుంచి భక్తుల ప్రాణాలను కాపాడుతుందా? ఇది సరైన నిర్ణయమేనా? అనే చర్చ మొదలైంది. తాజాగా, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు అమలాపురంలో గడియారం స్తంభం సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తిరుమత వెంకటేశ్వర స్వామి అందరి ఆరాధ్య దైవం అని చంద్రబాబు అన్నారు. అందుకోసం ఆయన దర్శనానికి తిరుపతి వెళ్లుతామని తెలిపారు. తిరుమలలో పులులు ఉన్నాయని భక్తులకు కర్రలు ఇస్తున్నారని చెప్పారు. ఇంటికో కర్ర తరహా పాత రోజులను గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు.
Also Read: Bandi Sanjay: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి బండి!.. 21న అమరావతికి
భక్తులు ఇలా కర్రలు పట్టుకుని శ్రీవారిని చూడడానికి వెళ్లుతున్నట్టు లేదని, తిరుమలలో పులులను చంపడానికి వెళ్లుతున్నట్టు ఉన్నదని చంద్రబాబు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. చేతిలో కర్ర ఉంటే పులి పారిపోతుందా? అంటూ ప్రశ్నించారు. పులుల బారినుండి తప్పించుకోవడానికి చేతి కర్రలు ఇచ్చే నిర్ణయం సరైనదేనా? అని అడిగారు. సమర్థ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందా? అంటూ ప్రశ్నించారు. ఇంటికో కర్ర పెట్టుకుని వాటితో వైసీపీ దొంగలను తరిమికొట్టాలని చంద్రబాబు సూచించారు.
