కొత్తపల్లి గీతకు కోపమొచ్చింది..ఎక్కడో టిడిపితో బెడిసికొట్టినట్లుంది. అందుకనే ‘‘టిడిపితో తనకు ఎటువంటి సంబంధం లేద’’ని బుధవారం ప్రకటించారు. 2014లో విశాఖపట్నం జిల్లా అరకు పార్లమెంటు స్ధానం నుండి వైసీపీ అభ్యర్ధిగా గెలిచారు. వారం తిరక్కుండానే చంద్రబాబును కలిసారు. దాదాపు మూడున్నరేళ్ళుగా టిడిపి పంచనే ఉంటున్నారు. హటాత్తుగా ఏమైందో ఏమో తనకు టిడిపికి ఏమీ సంబంధం లేదని తేల్చేసారు.

ప్రభుత్వం తాజాగా నియమించిన గిరిజన సలహా మండలిలో గీతకు సభ్యత్వం దక్కలేదు. అందుకే ఎంపికి అంత కోపం. అంటే టిడిపితోనే అంటకాగుతున్నా గీతకు వచ్చింది ఏమీ లేదన్న మాట అర్ధమైపోతోంది. అదే విషయమై గీత మీడియాతో మాట్లాడుతూ, గిరిజన సలహా మండలిలో తనకు స్ధానం లేకపోవటంపై మండిపడ్డారు. తనకు జరిగిన అవమానాన్ని ప్రివిలేజ్ కమిటి ముందు పెడతారట. అయితే, ఇక్కడే ఓ సమస్యుంది. అదేంటంటే, గీత ఎస్టీ కాదని, తప్పుడు సర్టిపికేట్ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసారనే కేసు విచారణలో ఉంది. టిడిపి ఎంఎల్సీ గుమ్మడి సంధ్యారాణే కోర్టులో కేసు వేశారు.