ఆంధ్రప్రదేశ్‌‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే వైరస్ కట్టడికి మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయి పలు అంశాలపై చర్చలు జరిపింది. ఇదే సమయంలో ప్రజా రవాణా ద్వారా వైరస్ మరింత వ్యాపించే అవకాశం వుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అప్రమత్తమైంది.

రాష్ట్రంలోని బస్సులు, ప్రయాణ ప్రాంగణాల్లో శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించడం, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ అధికారులను ఆదేశించారు.

బస్ స్టేషన్లు, కార్యాలయాల ఆవరణలో సోడియం హైపోక్లోరైట్‌తో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రాంతీయ మేనేజర్లు, ఈడీలతో ఆర్పీ ఠాకూర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Also Read:ఏపీలో కరోనా విలయతాండవం: 10 వేలు దాటిన కేసులు.. చిత్తూరు, సిక్కోలులో బీభత్సం

ఈ సందర్భంగా సిబ్బంది, ప్రయాణికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. బస్సులు నడపడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన మార్గాల్లో బస్సుల రాకపోకలు పెంచడం, లేని పక్షంలో తగ్గించడం వంటి చర్యలు చేపట్టాలని ఠాకూర్ సూచించారు. 

45 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగికి వాక్సినేషన్ చేయించాలని కోరారు.  డ్రైవర్లు, కండక్టర్లు సహా సిబ్బందికి డబుల్ లేయర్ మాస్కులు ఇవ్వాలని ఎండీ ఆదేశించారు. బస్సుల్లో మాస్కులు లేకుండా ప్రయాణించే వారికి అక్కడికక్కడే మాస్కులు సరఫరా చేయాలని సూచించారు.

కొవిడ్ బారిన పడిన సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 14 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27, 30వ తేదీల్లో పదవీ విరమణ పొందిన సిబ్బందికి బకాయిలు చెల్లించాలని ఆర్పీ ఠాకూర్ ఆదేశించారు.