Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో బస్సు ఛార్జీల పెంపు.. రేపటి నుంచే అమల్లోకి, ఏయే బస్సుల్లో ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. డీజిల్ సెస్ పెంపు కారణంగా ఛార్జీలు పెంచాల్సి వస్తోందని చెప్పిన ఆర్టీసీ.. సిటీ బస్సులకు మాత్రం ఈ పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. 

apsrtc hikes bus ticket charges
Author
Amaravati, First Published Jun 30, 2022, 8:20 PM IST

ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (ap govt) రాష్ట్ర ప్రజలకు షాకిచ్చింది. రేపటి నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ (apsrtc) నిర్ణయించింది. డీజిల్‌ సెస్‌ పెంపు కారణంగా ఛార్జీలు పెంచాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. అయితే ఈ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.

ఇకపోతే.. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై ప్రస్తుతం రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70.. హైదరాబాద్ వెళ్లే అమరావతి ఏసీ బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్‌ సెస్‌ పెంచుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. 

పల్లె వెలుగు బస్సుల్లో.. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10లుగా ఉంది. అయితే తొలి 30 కిలోమీటర్ల వరకు సెస్‌ పెంపు లేదు. 35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5లు సెస్‌ వసూలు చేస్తారు.  60 నుంచి 70 కి.మీ వరకు రూ.10...100 కి.మీ ఆపైన రూ.120 సెస్‌ విధించారు. ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5లు సెస్ కింద వసూలు చేస్తున్నారు. కానీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 30కి.మీ వరకు సెస్‌ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 ..66 నుంచి 80కి.మీ వరకు  రూ.10ను సెస్ కింద వసూలు చేయనున్నారు. 

Also Read:డీజిల్ సెస్‌ పేరుతో బాదుడే బాదుడు... భారీగా పెరగనున్న టీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలు, రేపటి నుంచే అమల్లోకి..?

కాగా.. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సైతం డీజిల్ సెస్ పెంచిన సంగతి తెలిసిందే. పల్లె వెలుగులో 250 కిలోమీటర్ల దూరానికి గాను రూ. 5 నుంచి 45కి, ఎక్స్‌ప్రెస్‌లో 500 కిలోమీటర్ల దూరానికి గాను రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్లకు రూ. 5 నుంచి 125కి, సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.130కి, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.170కి పెంచుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంపు లేదని యాజమాన్యం పేర్కొంది. దీనిపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. అదనపు డీజిల్ సెస్ అనివార్యమని పేర్కొన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా స్లాబ్‌లు రూపొందించినట్లు బాజిరెడ్డి తెలిపారు. 

కాగా.. గతంలో రౌండప్, టోల్‌ప్లాజాలు, ప్యాసింజర్స్ సెస్ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. తర్వాత ఆర్టీసీ మరోసారి ఏప్రిల్‌లో డీజిల్ సెస్ పేరుతో ప్రయాణీకులపై భారం మోపింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్ సెస్ కింద రూ.2, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios