పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులతో పాటే ఏపీఎస్ ఆర్టిసి ఉద్యోగులు కూడా సమ్మెకు సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ఈ పీఆర్సీతో ఆర్టిసి ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని... వారు సమ్మెకు వెళ్లవద్దని ఆ సంస్థ ఛైర్మన్ మల్లికార్జున్ రెడ్డి సూచించారు.
విజయవాడ: పీఆర్సీ (PRC) కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు... కాబట్టి వీరితో పాటే సమ్మెలో పాల్గొనడానికి ఏపీఎస్ ఆర్టిసి (APSRTC) ఉద్యోగులు సిద్దమయ్యారని ఆ సంస్థ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. అయితే ఆర్టీసి పీఆర్సీకి, ఉద్యోగుల పీఆర్సీకి అసలు సంబంధమే లేదని... ఈ విషయాన్ని ఆర్టీసి ఉద్యోగులు గుర్తించాలని ఛైర్మన్ సూచించారు. ఏవయినా సమస్యలుంటే సీఎం జగన్ (YS Jagan) దృష్టికి తీసుకెళ్లాలని... వాటిని ఆయన పరిష్కరిస్తారని మల్లికార్జున్ రెడ్డి అన్నారు.
''ఏపీఎస్ ఆర్టిసిని గాడిన పెట్టి ఉద్యోగులకు మంచి చేయాలనే దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసాం. అలాగే రెండేళ్ల క్రితం వరకు ఆర్టీసీకి రూ.6వేల కోట్లకు పైగా అప్పులుండేవి. అయితే ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు రూ.1495 కోట్లు చెల్లించాము. అయినా ఆర్టీసీకి ఇంకా రూ.4800 కోట్లుపైగా అప్పులున్నాయి. రెండేళ్లలో ఆర్టీసీకి ఉన్న అప్పులన్నింటినీ తీర్చాలని సీఎం ఆదేశించారు. కరోనా వల్ల ఆశించిన స్థాయిలో అప్పులు తీర్చలేకపోయాం. ఇలా కష్టకాలంలో అండగా ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగులూ అండగా ఉండాలి'' అని ఆర్టిసి ఛైర్మన్ కోరారు.
Video
''ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం వల్ల వచ్చిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మనం సమస్యలను పరుష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లవద్దని కోరుతున్నా. సమ్మెపై ఉద్యోగులు పునరాలోచించాలి'' అని మల్లికార్జున్ రెడ్డి సూచించారు.
''ఆర్టీసి సిబ్బంది వేతనాల కోసం నెలకు రూ.250 కోట్లు చొప్పున 25నెలల్లో రూ.6250 కోట్లు సీఎం జగన్ ఇచ్చారు. ప్రభుత్వం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు మేలు జరిగింది. ఇక మన ఆర్టీసీని ఉద్యోగులే రక్షించుకోవాలి. ఉద్యోగులు కష్టపడి పనిచేసి సంస్థను నిలబెట్టుకోవాలి'' అన్నారు.
''ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఆర్టిసి ఉద్యోగులు సమ్మెకు వెళ్లరనే అనుకుంటున్నాం. కాదని సమ్మెకు వెళితే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిర్ణయాలు తీసుకుంటాం. ప్రత్యామ్నాయంగా బస్సులు తిప్పడంపై ఎండీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం'' అని ఆర్టీసి ఛైర్మన్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.
ఇదిలావుంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్లకుండా సీఎస్ సమీర్ శర్మ వారిని బుజ్జగించే ప్రయత్నిం చేస్తున్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమన్నారు సీఎస్. ఉద్యోగులకెవరికీ జీతాలు తగ్గించవద్దని సీఎం జగన్ చెప్పారన్నారు. పీఆర్సీ విషయమై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల బృందం చర్చిస్తోందని... ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు వాయిదా వేసుకోవాలని సమీర్ శర్మ హితవు పలికారు.
సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని... ఉద్యోగులతో ఓపెన్ మైండ్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీఎస్ స్పష్టం చేశారు. అభ్యంతరాలను చర్చలతో పరిష్కరించుకునే అవకాశముంది... కాబట్టి సమ్మె కార్యాచరణ విరమించుకోవాలని సమీర్ శర్మ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళ్లడమంటే కష్టాలు కొని తెచ్చుకోవడమేనని... ఉద్యోగుల సమ్మెను అసాంఘిక శక్తులు కైవసం చేసుకునే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు . పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని సీఎస్ స్పష్టం చేశారు.
ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని... వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలని సమీర్ శర్మ అన్నారు. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్ స్కీమ్ వలన అదనపు ప్రయోజనం ఉందని.. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. సమ్మె ఆలోచనను విరమించుకోండి. మనమంతా ఒక కుటుంబం. హెచ్‌ఆర్‌ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నాను' అని సీఎస్ సమీర్ అన్నారు.
