ప్రాణాలు ప్రమాదంలో వున్నప్పటికీ విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించి 13 మంది ప్రయాణికులను కాపాడి ప్రాణాలొదిలాడో ఆర్టీసీ డ్రైవర్.

వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ వెళ్తుండగా జి కొండూరు మండలం గుర్రాజుపాలెం సమీపంలో డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది.

దీంతో బస్సు అదుపు తప్పింది. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా అంతటి విషమ పరిస్ధితుల్లోనూ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు పెట్టాడు. అనంతరం స్టీరింగ్‌పై కుప్పకూలిపోయాడు.

మరణించిన డ్రైవర్‌ను కృష్ణారావుగా గుర్తించారు. ఆయన స్వగ్రామం గంపలగూడెం మండలం పెనుగోలుగా అధికారులు తెలిపారు. కృష్ణారావు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.