తమిళనాడు నుండి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టిసి బస్సు మంటల్లో చిక్కుకుని దగ్దమయ్యింది. ఈ ప్రమాదం గురువారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. 

నెల్లూరు : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆర్టిసి బస్సులో మంటలు చెలరేగిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు గురువారం రాత్రి చెన్నై నుండి ప్రయాణికులతో బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు ఇంజన్ లో చిన్నగా పొగలురావడంమొదలై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ ముందుగానే అప్రమత్తమై బస్సును ఆపడంతో ప్రమాదం తప్పింది. 

ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టిసి బస్సు గురువారం ప్రయాణికులతో చెన్నైకి వెళ్లింది. రాత్రి 9.30 గంటలకు 47మంది ప్రయాణికులతో చెన్నైలోని మాధవరం నుండి తిరిగి ఆత్మకూరుకు బయలుదేరింది. అయితే కొంతదూరం వెళ్లగానే బస్సు ఇంజన్ లోంచి పొగలు రావడం ప్రారంభమయ్యాయి. ఇది గుర్తించిన డ్రైవర్ రెడ్ హిల్స్ సమీపంలో బస్సును రోడ్డుపక్కకు తీసుకుని నిలిపాడు. వెంటనే ప్రయాణికులంతా కిందకు దిగిపోయారు. 

అయితే ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే ఇంజన్ లోంచి మంటలు మొదలయ్యాయి. ఈ మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే బస్సు మంటల్లో దగ్దమయ్యింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. 

Read More నెమ్మదిగా కదులుతున్న రైలు దిగేందుకు ప్రయత్నం.. అదుపుతప్పి పట్టాలపై పడ్డ మెడికల్ స్టూడెంట్.. తీవ్ర గాయలతో మృతి

ఇంజన్ లో సాంకేతిక సమస్యల కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బస్సు దగ్దంపై సమాచారం అందుకున్న ఏపీఎస్ ఆర్టిసి అధికారులు చెన్నైకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయినట్లు ఆర్టిసి ఉన్నతాధికారులకు తెలిపారు.