వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం కడప ఎన్టీఆర్ నగర్‌లోని పేదల ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చేవేయడంతో.. ఆ ప్రాంతాన్ని శనివారం కాంగ్రెస్ నేతలు సందర్శించారు.

ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ... 25 సంవత్సరాలుగా పేదలు పైసా పైసా కూడబెట్టుకుని గుడిసెలు, ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. పాతికేళ్లుగా నివాసం ఉన్న పేదల గృహాలను వైసీపీ ప్రభుత్వం కూల్చి... వారిని నిరాశ్రయులుగా చేయడం దుర్మార్గమని తులసిరెడ్డి మండిపడ్డారు.

కనీసం వారికి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడం అన్యాయమన్నారు. ఒకవైపు ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కేటాయిస్తామని గొప్పలు చెప్పుకునే జగన్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చడం ఎంతవరకు కరెక్టని తులసిరెడ్డి ప్రశ్నించారు.

ఐదేళ్లలో 25 లక్షల పక్కా గృహాలు కట్టిస్తామని, ఇళ్ల స్థలాలు నిరుపేదలకు ఇస్తామని నవరత్నాల పథకాల్లో చెప్పి.. మరోవైపున కట్టుకున్న ఇళ్లను కూల్చడంలో జగన్ స్పెషలిస్ట్ అంటూ తులసిరెడ్డి సెటైర్లు వేశారు.

గూడు కోల్పోయిన వారందరికీ వెంటనే పునరావాసం కల్పించాలని.. అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.