Asianet News TeluguAsianet News Telugu

జగన్ రెడ్డి అంటే నచ్చట్లేదా?... మరి అలా అనమంటారా సుబ్బారెడ్డి గారు? : వైఎస్ షర్మిల

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న షర్మిల సామాన్య ప్రజలతో కలిసి ఆర్టిసి బస్సులో ప్రయాణించారు. 

APCC Chief YS Sharmila strong counter to YCP Leader YV Subbareddy AKP
Author
First Published Jan 23, 2024, 1:13 PM IST | Last Updated Jan 23, 2024, 1:24 PM IST

శ్రీకాకుళం : అధికార వైసిపి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టార్గెట్ చేసారు. ఇటీవల ఏపిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల సొంత అన్నను పట్టుకుని జగన్ రెడ్డి అంటూ సంబోధించడంపై వారి చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. అలాగే పక్కరాష్ట్రం నుండి వచ్చిన ఆమెకు ఏపీలో అభివృద్ది గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేసారు. దీంతో చిన్నాన్నను కూడా సుబ్బారెడ్డి గారు అంటూ షర్మిల కౌంటర్ ఇచ్చారు. 

ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అనడం వైవి సుబ్బారెడ్డి గారికి నచ్చనట్లుంది... అయితే జగనన్న అని అనడానికీ తనకు ఎలాంటి ఇబ్బంది లేదని షర్మిల తెలిపారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది గురించి తనకేమీ తెలియదంటూ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల అభ్యంతరం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని చూపిస్తానంటూ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు షర్మిల తెలిపారు. సరే సార్... మీరు చేసిన అభివృద్ది ఏమిటో చూపించండి? అని షర్మిల సెటైరికల్ గా కామెంట్స్ చేసారు. 

వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూపించడానికి డేట్, టైమ్ ఫిక్స్ చేయాలని వైవి సుబ్బారెడ్డిని కోరారు షర్మిల. లేదంటే ఆ డేట్, టైమ్ తమను నిర్ణయించమన్నా అందుకూ సిద్దమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రంలోని మేధావులు, మీడియా అందరూ వస్తారు... అందరికీ ఆ అభివృద్దిని చూపించాలని షర్మిల సవాల్ విసిరారు.  

వీడియో

వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా షర్మిల సెటైర్లు వేసారు.  మీరు చేసిన డెవలప్ మెంట్ ఎక్కడ? కడతామన్న మూడు రాజధానులు ఎక్కడ? పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఏమయ్యింది? అనేవి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారని అన్నారు. ఇవి ఎప్పుడు చూపిస్తారన్నా మేం రెడీ అని ఏపిసిసి చీఫ్ షర్మిల అన్నారు. 

Also Read  Andhra Pradesh Election 2024 : అన్నను ఢీకొట్టేందుకు చెల్లి రెడీ... రంగంలో దిగిన షర్మిల

ఆంధ్ర ప్రదేశ్ టిపిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ప్రజల్లోకి వెళుతున్నారు వైఎస్ షర్మిల. జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం శ్రీకాకుళం జిల్లాకు ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకం అవుతూ సామాన్యురాలి మాదిరిగా బస్సు ప్రయాణం చేసారు. ప్రయాణికులతో ముచ్చటిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు వైఎస్ షర్మిల. ఇలా పలాస నుండి ఇచ్చాపురం వరకు ఆమె బస్సు ప్రయాణం చేసారు. షర్మిలతో పాటే ఏఐసిసి ఏపి ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్, మాజీ ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు కూడా బస్సులో ప్రయాణించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios