విజయవాడ: వైసిపి నాయకులు విశాఖ ఉక్కు కర్మాగారంపై చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను బాధిస్తున్నాయని ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజనాధ్ అన్నారు. ప్రతిపక్షాల విజ్ఞతకు వదిలేస్తున్నామంటూ అధికార పార్టీ నాయకులు, సీఎం జగన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని... ఇంత అసమర్ద నాయకులను, పరిపాలనను జగన్మోహనరెడ్డి నాయకత్వంలో గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అమాయకంగా మొహం పెట్టి మాట్లాడితే ప్రజలు గుడ్డిగా నమ్ముతారనుకోవడం పొరపడినట్లేనని శైలజానాథ్ పేర్కొన్నారు.  

''ఉక్కు కర్మాగారంపై మీకున్న ప్రేమ కనిపిస్తూనే ఉంది. సంవత్సరం క్రితమే ఉక్కు కర్మాగారం అమ్మకానికి రంగం సిద్ధం చేశారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి మీ బట్టలు ఊడదీసినట్టు విషయాన్ని చెప్పారు. ఇంకా అమాయకంగా నటిస్తే లాభం లేదు. మీ ఎంపీలు ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ పెట్టిన మాట వాస్తవం కాదా?'' అని ప్రశ్నించారు. 

''ఈ రాష్ట్ర ప్రజలను, కార్మికులను వైసిపి నాయకులు మోసం చేస్తున్నారు. కానీ విశాఖ వెళ్తే మాత్రం ఉక్కు ప్యాక్టరీని అమ్మేవాడేవడు, కొనేవాడేవడు అని చెబుతారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ వెనుక కుట్ర పూరిత స్కాం ఉంది. దీన్ని ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది'' అని అన్నారు. 

''రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను కాపాడలేని అసమర్థులు వైసిపి ఎంపీలు.  వీరు బొమ్మల మాదిరిగా చేతకాని వారీగా మిగిలిపోయారు. మోడీ మన్ కి బాత్ లాగా మీరు ఉత్తరాలు కి బాత్ చేస్తుంటారు. పార్లమెంట్ లోపల బయట వైసిపి ఎంపిక పోరాడాల్సిన అవసరం ఉంది. చూస్తాం చేస్తాం అని మాట్లాడితే కుదరదు'' అని హెచ్చరించారు.

''ఉక్కు కర్మాగారం 2 లక్షల కోట్లను ఇవ్వడానికి ఎంత తొందర పడుతున్నారో అర్ధమవుతుంది. అమాయకంగా మొహం పెట్టి ఎవరన్నా మాట్లాడితే వారిపై విరుచుకుపడుతున్నారు. ఇంత అసమర్ధ ,బలహీన ప్రభుత్వాన్ని గతంలో చూడలేదు.ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తాం'' అని శైలజానాధ్ ప్రకటించారు.