విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్న సంగతి తెలిసిందే. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులకు కమీషన్ నోటీసులు జారీ చేసింది.  

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులకు (bonda umamaheswara rao) ఏపీ మహిళా కమీషన్ (ap women's commission) సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విజయవాడలో విచారణకు హాజరుకావాలని కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ (vasireddy padma) పట్ల అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న కమీషన్ చంద్రబాబు, బొండా ఉమాలకు సమన్లు జారీ చేసింది. అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించనీయకుండా, ఆమె ఆవేదనను వినకుండా కమీషన్ ఛైర్‌పర్సన్‌‌ విధులకు ఆటంకం కలిగించారని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా వాసిరెడ్డి పద్మపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారని కమీషన్ ఆరోపించింది. 

కాగా.. అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు వాసిరెడ్డి పద్మ శుక్రవారం నాడు విజయవాడ పాత ఆసుపత్రికి వచ్చారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ బాధితురాలి వద్ద ఉన్న సమయంలోనే Chandrababu Naidu కూడా అక్కడికి చేరుకున్నారు. వాసిరెడ్డి పద్మ ఆసుపత్రి లోపలికి వెళ్లే సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల సహాయంతో ఆమె ఆసుపత్రి లోపలికి వెళ్లారు.

అయితే అదే సమయంలో బాధితురాలి వద్దకు చంద్రబాబు కూడా వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సమయంలో టీడీపీ నేత పంచుమర్తి అనురాధ, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య మాటల యుద్ధం సాగింది. మధ్యలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా ఈ విషయమై జోక్యం చేసుకొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, వాసిరెడ్డి పద్మ మధ్య గొడవ జరిగింది. పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. బాధితురాలికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హమీ ఇచ్చారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. రాజకీయం చేయడం కోసం గ్యాంగ్ రేప్ ఘటనను ఉపయోగించుకొంటున్నారని ఆమె టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ముందే విజయవాడ సీపీ క్రాంతి రాణా ను ఆదేశించినట్టుగా వాసిరెడ్డి పద్మ చెప్పారు.