రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం టీడీపీ నేతలు నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బాధితురాలు దగ్గర రాజకీయాలు చేయడమేమిటని ప్రశ్నించారు.
రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం టీడీపీ నేతలు నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బాధితురాలు దగ్గర రాజకీయాలు చేయడమేమిటని ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పై మీ బల ప్రదర్శన చేయడం ఏమిటని ప్రశ్నించారు. బహిరంగ సభలో లాగా బాధితురాలి దగ్గర టీడీపీ నేతలు ప్రవర్తించారని ఆరోపించారు. తాను బయటికి వెళ్లాలని సూచించానని.. బయట అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానని చెప్పిన వినిపించుకోలేదని చెప్పారు.
బాధితురాలిని పరామర్శించేందుకు వస్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మానవత్వం మరిచిపోయారని విమర్శించారు. అత్యాచార బాధితురాలి గదిలో కేకలు వేస్తారా అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. బాధితురాలు భయపడుతుందని చెబితే.. చంద్రబాబు తనను భయపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్‌తో ప్రవర్తించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. బొండా ఉమా మహిళా కమిషన్ సుప్రీమా అంటున్నారు.. ఇలాంటి వ్యాఖ్యలతో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మహిళా కమిషన్ డమ్మీ కాదని వాసిరెడ్డి పద్మ చెప్పారు. చంద్రబాబు సమక్షంలో గొడవ జరగడంతోనే సమన్లు జారీ చేసినట్టుగా చెప్పారు. నోటిసులు ఇస్తే తప్పుకుండా విచారణకు రావాల్సిందేనని అన్నారు. వేలు చూపి బెదిరించి.. గుడ్లు ఉరుముతారా అని ప్రశ్నించారు.
అత్యాచార బాధితురాలిని పరామర్శించడం చంద్రబాబుకు తెలియదని అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన బాధితురాళ్లను పరామర్శించడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఆయన అత్యాచార బాధితురాలిని పరామర్శించడం ఇదే తొలిసారి కావచ్చని చెప్పారు. చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ అంటే గౌరవం లేదన్నారు. ఈరోజు పవర్‌ఫుల్‌గా వ్యవహరిస్తోందన్నారు.
ఇక, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ శ్రేణులు అడ్డుకుని గొడవకు దిగారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడకు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు మహిళ కమిషన్ నోటీసులు జారీచేసింది.
