వైద్య విద్యార్థినిపై సూపరింటెండెంట్ లైంగిక వేధింపులు... మహిళా కమీషన్ సీరియస్ (వీడియో)
తమపట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే బాధిత విద్యార్థినులు మహిళా కమీషన్ వాట్సాప్ నెంబరు 9394528968 కు స్వయంగా సంప్రదించవచ్చని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
వైద్య విద్యార్థినిపై నెల్లూరు జిజిహెచ్ సూపరిండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ తో ఈ విషయంపై మాట్లాడిన ఆమె ఇటువంటి కామాంధులను ఉపేక్షించరాదని కోరారు. తమపట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే బాధిత విద్యార్థినులు మహిళా కమీషన్ వాట్సాప్ నెంబరు 9394528968 కు స్వయంగా సంప్రదించవచ్చని పద్మ తెలిపారు.
కరోనా సమయంలో ప్రత్యక్షదైవంగా చూస్తున్న వైద్య వృత్తికి మచ్చ తెచ్చే విధంగా నెల్లూరు సూపరిండెంట్ వ్యవహరించటం బాధాకరమన్నారు. ఇతని తప్పుడు ప్రవర్తనతో మానసికంగా కృంగిపోయిన బాధితులు అందరూ నిర్భయంగా వివరాలు మహిళా కమిషన్ కు వెల్లడించాలని పద్మ కోరారు. ఇతని పై ఫిర్యాదు చేసిన బాధితుల వివరాలు రహస్యంగా ఉంచబడతాయని అందరూ ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
వీడియో
ఇప్పటికే ఈ ఘటనపై ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ ఎదుట అన్ని విషయాలు వెల్లడించాలని బాధితులకు వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ని కూడా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు.
కూతురు వయసు విద్యార్థినితో నెల్లూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ అసభ్యంగా ప్రవర్తించాడు. తన రూమ్ కి రమ్మంటూ.. నీచంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉపాధ్యాయుడి కారణంగా తాను పడిన వేదనను సదరు విద్యార్థిని ఆడియో రికార్డు చేయగా.. ఇప్పుడు అది బయటకు వచ్చింది.
''నువ్వు నా సోల్ మేట్.. లైఫ్ పార్ట్ నర్.. వైజాగ్ కోడలయ్యేదానివి అంటూ మాట్లాడటం ఏంటి సార్..? నా వయసు 23ఏళ్లు. నాకు తెలిసి మీ పిల్లలకు కూడా ఇదే వయసు ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నా.. ఎందుకు ఫోన్ చేస్తున్నారు..? రెస్టారెంట్లు, బీచ్ కి రమ్మని అడుగుతున్నారు.. నీ రూమ్ లో ఏసీ లేదుగా.. నా రూమ్ కి రా అని ఎలా పిలుస్తారు? ఏం మాటలవి సార్? నేను మౌనంగా ఉన్నానని అనుకుంటున్నారా? మీ నెంబర్ బ్లాక్ చేస్తే.. మరో నెంబర్ నుంచి ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నారు? మీ వేధింపుల కారణంగా పుస్తకం కూడా పట్టుకోలేకపోతున్నాను’ అంటూ బాధిత విద్యార్థిని పేర్కొనడం గమనార్హం. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విచారణకు ఆదేశించారు.