Asianet News TeluguAsianet News Telugu

అడవి బిడ్డలను ఆదుకోవడానికి కొత్త చట్టం: మంత్రి పుష్ఫశ్రీవాణి

గిరిజనులకు ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో గిరిజనుల హక్కులను కాపాడటానికి న్యాయపరమైన అన్ని చర్యలను తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

AP Tribal Advice Committe Meeting on GO Number 3 issue
Author
Amaravathi, First Published Jun 18, 2020, 10:29 PM IST

అమరావతి: గిరిజనులకు ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో గిరిజనుల హక్కులను కాపాడటానికి న్యాయపరమైన అన్ని చర్యలను తీసుకోవాలని, గిరిజనులకు న్యాయం చేయడానికి అవసరమైతే చట్టంలో సవరణలు చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించింది.

జీవో నెంబర్.3 విషయంగా రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసి) ప్రత్యేక సమావేశాన్ని గురువారం సచివాలయంలో నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణితో పాటుగా గిరిజన శాసనసభ్యులు తెల్లం బాలరాజు(పోలవరం), పీడిక రాజన్న దొర(సాలూరు), కళావతి(పాలకొండ), చెట్టి ఫాల్గుణ (అరకు), భాగ్యలక్ష్మి (పాడేరు), ధనలక్ష్మి (రంపచోడవరం), గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ రంజిత్ బాషా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.వీరంతా జీవో నెంబర్.3 విషయంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి సుధీర్ఘంగా చర్చించారు. 

ఈ విషయంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ...ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు, భాషలు, సాంప్రదాయాల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో స్థానికులైన గిరిజనులు ఉపాధ్యాయులుగా ఉంటేనే ఎక్కువ మంది గిరిజన పిల్లలు చదువుకోవడానికి, డ్రాప్ అవుట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి గతంలో జీవో నెంబర్.3ని తీసుకురావడం జరిగిందని చెప్పారు. సుప్రీంతీర్పు తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సిఎం కార్యాలయ అధికారులు, గిరిజన సంక్షేమశాఖ అధికారులు, న్యాయవిభాగం అధికారులు ఇప్పటికే మూడుసార్లు సమావేశాలను నిర్వహించారని తెలిపారు. 

ఈ విషయంగా తెలంగాణా రాష్ట్రానికి చెందిన న్యాయ విభాగం అధికారులు, అడ్వొకేట్ జనరల్ తోనూ సమన్వయ సమావేశాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయడానికి ఎలాంటి గడువు లేదని, దీనికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఉన్నాయని గిరిజన సంక్షేమశాఖ న్యాయ సలహాదారు పల్లా త్రినాథరావు వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

read more  టీడీపీ ఆఫీసులో వ్యూహాం... కౌన్సిల్‌లో అమలు: మండలి పరిణామాలపై బొత్స సీరియస్

 అయితే సుప్రీం కోర్టులో జీవో నెంబర్.3 ని కొట్టేయడానికి ఉన్న కారణాలను న్యాయకోవిదులు  విశ్లేషించిన తర్వాత ఈ విషయంలో కేవలం రివ్యూ పిటీషన్ వేసి చేతులు దులిపేసుకోకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో పాటుగా అవసరమైన దిశానిర్దేశం చేసారని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తూ మరోవైపున గిరిజనులకు న్యాయం చేయడం కోసం ప్రస్తుతం ఉన్న చట్టాలలో సవరణలు చేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చే ప్రక్రియపై కూడా కసరత్తు చేయడం జరుగుతోందని పుష్ప శ్రీవాణి తెలిపారు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేసారు. అయితే కొంతమంది కావాలనే రాజకీయదురుద్దేశాలతో జీవో నెంబర్.3 పై అనవసరమైన రాద్ధాంతం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాగా జీవో నెంబర్.3 పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేయడంతో పాటుగా ఏజెన్సీ గిరిజనులకు ఉద్యోగాలలో 100శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని పలువురు గిరిజన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో కోరారు.


న్యాయపరమైన చర్యలు.. కొత్త చట్టం:

కాగా జీవో నెంబర్.3 విషయంగా న్యాయపరమైన చర్యలన్నింటినీ తీసుకోవడంతో పాటుగా గిరిజనులకు న్యాయం చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతూ టీఏసీ తీర్మానించింది. అదే విధంగా గిరిజన సంక్షేమంపై చిత్తశుద్ధితో కృషి చేస్తూ, గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడటం కోసం అన్ని చర్యలు తీసుకుంటుంన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిని అభినందిస్తూ మరో తీర్మానాన్ని కూడా టీఏసీ ఆమోదించింది. 

దీంతో పాటుగా ఐటీడీఏలలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు రూ.153 కోట్లను కేటాయించినందుకు  ముఖ్యమంత్రిని అభినందిస్తూ కూడా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో జీసీసీ ఎండి శోభ, ట్రైకార్ ఎండి ఈసా రవీంద్ర బాబు, గిరిజన సంక్షేమశాఖ న్యాయసలహాదారు పల్లా త్రినాథరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios