శ్రీశైలం ధర్మల్ పవర్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు మరణించిన సంఘటనను మరిచిపోకముందే మరో ట్రాన్స్‌కో ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు.

వరద ప్రవాహంతో కళకళలాడుతున్న శ్రీశైలం డ్యామ్‌ను చూడ్డానికి వెళ్లిన ఓ వ్యక్తి శవమై తేలాడు. వివరాల్లోకి వెళితే... ఎలకపాటి మల్లిఖార్జున అనే 53 ఏళ్ల వ్యక్తి శ్రీశైలం ఏపీ ట్రాన్స్‌‌కో కార్యాలయంలో నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన ఆయన ఏదో పని కోసం తెలంగాణలోని దోమలపెంట గ్రామానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చే  సమయంలో బైక్‌ను తమ బంధువు దగ్గర వుంచి శ్రీశైలం జలాశయం చూసి వస్తానని చెప్పాడని మృతుడి భార్య తెలిపారు.

అయితే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు లింగాల గట్టు బోయ క్యాంపు వద్ద మల్లిఖార్జున శవమై తేలాడు. దీంతో తన భర్తకు మద్యం అలవాటు ఉందని తాగిన మత్తులో ప్రమాదవశాత్తూ కాలుజారి నదిలో పడి చనిపోయి వుంటాడని మృతుడి భార్య పోలీసులకు తెలిపింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిరుపేద కుటుంబం కావడం, మల్లిఖార్జున ఒక్కడే ఉద్యోగం చేస్తుండటంతో అతని భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.