మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆర్కే రోజా తొలిసారిగా సోమవారం తన నియోజవర్గం నగరికి విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రోజా పాల్గొన్నారు.

మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆర్కే రోజా తొలిసారిగా సోమవారం తన నియోజవర్గం నగరికి విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రోజా పాల్గొన్నారు. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. నగరి ప్రజలు రాజకీయంగా జన్మనిచ్చారు. నా తల్లిదండ్రులు నాకు ఊపిరి ఇస్తే.. జగనన్న ఊహించని విధంగా మంత్రి ఉన్నత స్థాయి ఇచ్చాడు. రాజకీయంగా నేను ఇద్దరికే రుణపడి ఉన్నాను.. ఒకటి నా నగరి ప్రజలకు, ఇంకొకటి జగనన్నకు మాత్రమే. నా కంఠంతో ప్రాణం ఉన్నంత వరకు నగరి అభివృద్ది కోసం పనిచేస్తాను. చివరి రక్తపుబొట్టు వరకు జగనన్న కోసం పని చేస్తాను. జగనన్న నాయకత్వంలో ఒక సైనికురాలిగా పనిచేస్తాను’’ అని రోజా అన్నారు. 

సీఎం జగన్ తనకు కేటాయించిన పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే విషయంలో దృష్టి పెడతానని చెప్పారు. రోజాకు నెక్ట్స్ సీటు రాదు, రోజా పని అయిపోయింది.. అంటూ ఎంతమంది ఎన్నిరకాలుగా మాట్లాడిన వారి నోళ్లు మూతపడేలా ఇక్కడి ప్రజలు తనను రెండుసార్లు గెలిపించారని అన్నారు. జగనన్న మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. 

Scroll to load tweet…

ఇన్నిరోజులు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క.. తన సత్తా ఏమిటో చూపిస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. వారి కష్టాలనుతొలగించేందుకు కృషి చేస్తానని తెలిపారు. నగరి ప్రజల ప్రేమను మరువలేనని.. వారికి రుణపడి ఉంటానని చెప్పారు. 2024లోనూ జగనే ముఖ్యమంత్రి అవుతారని రోజా ధీమా వ్యక్తం చేశారు.