పరిపాలనా కారణాల వల్ల ఈ నెలలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం ఏప్రిల్ నెలకు వాయిదా వేసిందని ఆయన వెల్లడించారు. ఎన్నికల వల్ల విద్యార్ధులు ఇబ్బంది పడకుండా పరీక్షలు వాయిదా వేశామని సీఈవో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శనివారం షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్. పరీక్షలు, కరోనా వైరస్ లాంటి అంశాలను పరిగణనలోనికి తీసుకున్నామన్నారు.  

Also Read:అమరావతి: సుజనా చౌదరికి జీవీఎల్ షాక్, జగన్ కు ఊరట

పార్టీల నుంచి వచ్చిన అభ్యర్ధనలను సైతం పరిగణనలోనికి తీసుకున్నామని రమేశ్ తెలిపారు. .. ఎన్నికల నిర్వహణకు వాతావరణం అనుకూలంగా ఉందని భావించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని రమేశ్ స్పష్టం చేశారు. 

ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణ సున్నితమైన అంశం కావడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించామని ఆయన వెల్లడించారు. ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలి, సిబ్బంది, బందోబస్తుపై ఇప్పటికే అధికారులతో చర్చించామని రమేశ్ వెల్లడించారు.

పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని, ఫాస్ట్ ట్రాక్‌లో కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో గతంలో ఉన్న కుల ధృవీకరణ పత్రాలన్నీ చెల్లుతాయన్నారు. పార్టీల అభిప్రాయం మేరకు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని, ఏ పార్టీ కూడా ఈవీఎంలు కావాలని అడగలేదని రమేశ్ తెలిపారు. 

Also Read:ఏపీలో స్థానిక ఎన్నికలకు నోటీఫికేషన్ విడుదల: మార్చి 21న పోలింగ్

కాగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి మార్చి 21న తొలి విడత, మార్చి 24న రెండో విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. మార్చి 27న పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల రెండింటికీ కలిపి మార్చి 29న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ ఛైర్మన్‌ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 

శ్రీకాకుళం- బీసీ (మహిళ)
విజయనగరం- జనరల్
విశాఖపట్నం- ఎస్టీ (మహిళ)
తూర్పుగోదావరి- ఎస్సీ (మహిళ)
పశ్చిమ గోదావరి- బీసీ
కృష్ణా- జనరల్ (మహిళ)
గుంటూరు- ఎస్సీ (మహిళ)
ప్రకాశం- జనరల్ (మహిళ)
నెల్లూరు- జనరల్ (మహిళ)
చిత్తూరు- జనరల్
కడప- జనరల్
అనంతపురం- బీసీ (మహిళ)
కర్నూలు- జనరల్