న్యూఢిల్లీ: అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో లేదా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు, అధికార ప్రతినిధి తమ పార్టీ ఎంపీ సుజనా చౌదరికి షాక్ ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఊరట కల్పించారు. వైఎస్ జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సుజనా చౌదరి గురువారం ఘాటుగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన రెండు మూడు గంటల వ్యవధిలోనే జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. 

సుజనా చౌదరి వ్యాఖ్యలకు ఆయన పరోక్షంగా కౌంటర్ ఇస్తూ వెళ్లారు. పైగా, అమరావతి గురించి గానీ, రాష్ట్ర రాజకీయాల గురించి గానీ తాను పార్టీ అధిష్టానం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు.  జీవీఎల్ అలా మాట్లాడడానికి కారణం ఉంది. సుజనా చౌదరి చేస్తున్న వ్యాఖ్యలను సరిచేయడం, ఆయన తప్పుడు అభిప్రాయాలను ఖండించడానికే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు కనిపిస్తున్నారు. 

Also Read: అమరావతి రాజధాని గుట్టు విప్పిన బిజెపి ఎంపీ జీవీఎల్

కేంద్రం తరఫున మాట్లాడే హక్కు, అవకాశం తమకు లేదంటూనే రాజధానిని అమరావతి నుంచి కదిలించడానికి అవకాశం లేదని సుజనా చౌదరి అన్నారు. అవసరమైతే బిజెపి జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను అమరావతి తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు. రాజధాని తరలింపు విషయాన్ని పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెడితే మంచిదని ఆయన జగన్ కు సలహా కూడా ఇచ్చారు. అమరావతి నుంచి రాజధానిని కదిలించడం అనేది ప్రస్తుతానికి రాష్ట్ర సమస్యనే అని, అయితే దాని ప్రభావం కొంత కాలం ఆగితే తెలుస్తుందని ఆయన అన్నారు. కేంద్రం చూస్తూ చూస్తూ వేల కోట్ల రూపాయలను వృధా చేయాలని చెప్పబోదని ఆయన అన్నారు. 

అమరావతి నుంచి రాజధానిని తరలించే విషయంపై సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండడంతో దాన్ని ఖండించడానికే కేంద్రం వైఖరిని జీవీఎల్ తెలియజేయడానికే మీడియా ముందుకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తమ పార్టీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసిన విషయం నిజమే గానీ కేంద్రం దాన్ని వినాలని ఏమీ లేదని ఆయన అన్నారు. 

పిపీఎల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టినప్పటికీ కేంద్రం రాష్ట్రంపై చర్యలు తీసుకోలేకపోయిందని చెప్పారు. తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని అంశాలనూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని లేదని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్ర రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా వేసవి రాజధానిని ప్రకటించడం దానికి నిదర్శనమని ఆయన అన్నారు

రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే స్పష్టంగా చెప్పిందని, నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోదని అన్నారు. 

ఎవరైనా కేంద్రం చేతిలో అధికారం ఉందని అమరావతి విషయంలో తప్పుడు హామీలు ఇచ్చినా, వ్యాఖ్యలు చేసినా అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలే అవుతాయని జీవీఎల్ అన్నారు. ఈ మాటలు ఆయన సుజనా చౌదరిని దృష్టిలో పెట్టుకుని చేసినట్లు భావిస్తున్నారు.