రావతి; విధ్వేషాలు, విధ్వంసాలే వైసీపీ ప్రధాన ఎజెండా అని. ప్రజాబలం లేకే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అరోపించారు. ఎన్నికలు అయిపోయాక కూడా కావాలనే టీడీపీ నేతలపై వైసీపీ కక్ష సాధింపులకు దిగుతోందన్నారు. వైసీపీ చేసే రిగ్గింగును టీడీపీ అడ్డుకుంటే పోలీసు విధులను అడ్డుకున్నట్టా? అని అచ్చెన్న నిలదీశారు, 

''అనంతపురం జిల్లా కదిరిలో అధికారపార్టీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రోద్బలంతో టీడీపీ ఇంచార్జి కందికుంట వెంకటప్రసాద్ పై అక్రమ కేసు బనాయించారు. గుంటూరు 42వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బుజ్జిపై హత్యాయత్నం కేసుతో పాటు, డివిజన్ అధ్యక్షుడు ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి కనపర్తిపై దొంగ కేసులు పెట్టారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్లి రిగ్గింగ్ చేయాలని ప్రయత్నించారు. అతనిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? టీడీపీకి వర్తించిన సెక్షన్లు అధికార పార్టీకి వర్తించవా?'' అని అచ్చెన్న పోలీసులను ప్రశ్నించారు. 

''రాష్ట్రంలో డీజీపీ, ఎస్ఈసీ ఏం చేస్తోంది.? టీడీపీకి మద్ధతుగా ఉన్నారన్న కుట్రతో పచ్చని పొలాలు తగలబెట్టి ఆర్థికంగా చిదిమేస్తున్నారు. కన్న కొడుకుగా భావించే పొలాలను కూడా ధ్వంసం చేసి నరరూప రాక్షసులగా ప్రవర్తిస్తున్నారు. ఈ భయంతోనే పోలింగ్ శాతం కూడా తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయకపోతే ఆందోళనకు దిగుతాం'' అని హెచ్చరించారు. 

''వైసీపీ పాల్పడిన ఒక్క అక్రమం కూడా మీ కటింటికి కనిపించకపోవడం దారుణం. ప్రజాస్వామ్య ఖూనీకి మీరు పడుతున్న ఆరాటాన్ని చూస్తే ప్రజల నుండి తిరుగబాటు తొందరలోనే వస్తుంది.  టీడీపీ అధికారంలోకి వచ్చాక అత్యుత్సాహం చూపిస్తున్న పోలీసులు, అరాచకానికి పాల్పడుతున్న వైసీపీ నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని అచ్చెన్న హెచ్చరించారు.