విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి సభ్యురాలయిన చుక్కా నాగవెంకట వరలక్ష్మి కారులో అక్రమ మద్యం లభించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. పవిత్రంగా ఉండాల్సిన దేవాలయాల పాలకమండళ్ల సభ్యులు దిగజారి వ్యవహరిస్తున్నారని... తక్షణమే దుర్గగుడి పాలకమండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాలకమండలి చేసిన అరాచకాలకు దేవాదాయ మంత్రి నైతిక బాధ్యత వహించాలని కళా అన్నారు. 

''సంబంధిత మంత్రి కనుసన్నల్లోనే పాలకమండలి సభ్యులు పనిచేస్తున్న మాట వాస్తవం కాదా? రాజీనామా చేయాల్సింది బోర్డు సభ్యురాలు కాదు... ముందు నైతిక బాధ్యతగా మంత్రి రాజీనామా చేయాలి. రాజకీయ విమర్శలపై చూపుతున్న శ్రద్ధ.. దేవాలయాల పటిష్టతపై చూపడం లేదు. ఈ ఘటనతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాలకమండళ్ల నియామకాలు ఏ పద్ధతిలో జరిగాయో తాజా సంఘటన నిదర్శనం. హిందూ దేవుళ్ల పట్ల విశ్వాసం లేనివారికి పదవులు కట్టబెట్టి హిందు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు'' అని ఆరోపించారు. 

read more  కనకదుర్గ అమ్మవారి వెండి రథం మూడు సింహాల విగ్రహాలు చోరీ: దర్యాప్తులో పురోగతి

''దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు, విధ్వంసం... తిరుమలలో, శ్రీశైలంలో అన్యమత ప్రచారం, హుండీల్లో డబ్బుల గల్లంతు, అన్యమతస్థులకు దుకాణాల కేటాయింపు హిందువుల మనోభావాల పట్ల కొనసాగుతోన్న దాష్టికానికి నిదర్శనం. దుర్గగుడి సభ్యురాలి కారులో అక్రమ మద్యం తరలించడం.. అత్యంత జుగుప్సాకరం. పవిత్రంగా ఉండాల్సిన పాలకమండలి సభ్యురాలు దిగజారి వ్యవహరించారు. ఇందుకు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?'' అని ప్రశ్నించారు. 

''దేవాలయాల ప్రతిష్టను పథకం ప్రకారం వైసీపీ మంటగలుపుతోంది. లిక్కర్, శాండ్, మైనింగ్, ల్యాండ్ మాఫియాలతో దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. దుర్గగుడి పవిత్రతకు భంగం వాటిల్లేలా సాక్షాత్తు ఈవో, ఛైర్మన్, పాలక మండలి సభ్యులే వ్యవహరిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు . దుర్గగుడి అమ్మవారి వెండి ఉత్సవ రథంపై మూడు సింహాల మాయమైనా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేక పోయారు. దేవాదాయ శాఖ మంత్రి, ఆలయ ఈవో, ఛైర్మన్ ఘటనను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేలా వ్యవహరించారు'' అన్నారు. 

''ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఇప్పటికైనా పాలకమండలిని రద్దు చేసి భక్తుల మనోభావాలను కాపాడాలి. హిందువుల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా, హిందూ దేవుళ్లను ఇష్టానుసారంగా తిడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయాలను కాలరాసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారు'' అని కళా వెంకట్రావు హెచ్చరించారు.