గుంటూరు: ఊహాజనితముగా తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై తప్పుడు కేసులు బనాయించి ప్రజల సొమ్మును దుబారా చేయడం తప్ప ఈ 15 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం సాధించిందేంటి? అని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, వైసీపీ 15 నెలల పాలనలో జరిగిన అవినీతి  కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ ప్రభుత్వం రోజుకో అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల సొమ్మును, కాలాన్ని దుర్వినియోగం చేస్తోందని అన్నారు. 

''హవాలా వ్యవహారంలో వైసీపీ మంత్రి బాలినేని పేరు బయటకు వచ్చినప్పుడు అచ్చెన్నాయుడిపై అక్రమంగా తప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు వైఎస్ కుటుంబంపై సిబిఐ విచారణను దృష్టి మళ్లించడానికి మరొక తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారు. జగన్ సీఎంగా అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజాస్వామిక వ్యవస్థలపై ప్రణాళికబద్ధమైన దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కుట్రకు తాడేపల్లే ప్రధాన కేంద్రం'' అని ఆరోపించారు. 

''తాడేపల్లి లో ఉన్నది వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు, కుట్రలకు కేంద్రాలయం. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలన్నీ ఇక్కడ స్క్రిప్టు ప్రకారమే జరుగుతున్నాయి. ప్రారంభంలో పెట్టుబడిదారులను ఇబ్బందులకు గురిచేశారు. తర్వాత గత ప్రభుత్వ పథకాలు రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ పై దాడి చేశారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి బెదిరించారు'' అని మండిపడ్డారు. 

read more   జగన్ కి కేసుల భయం పట్టుకుంది.. యనమల

''మీడియాపై దాడి చేశారు. దళితులపై, మైనారిటీలపై దాడి చేశారు. చివరకు పోన్ లను కూడా టాపింగ్ చేస్తున్నారు. ఇసుక మాఫియా, మద్యం కుంభకోణాలు ఇలా  వైసీపీ అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా చూసుకోవడం కోసం దళితులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు,  ఉపాధ్యాయులు, న్యాయాధికారులపై దాడులు చేస్తున్నారు. 3 రాజధానుల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేక త నుంచి ప్రజల దృష్టి మల్లించేందుకు ఇప్పుడు ఇన్ సైడర్ ట్రెడింగ్ అంటున్నారు'' అని ఆరోపించారు. 

''వైసీపీ ప్రభుత్వ 15 నెలల పాలనలోనే అనేక కుంభకోణాలు, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వెలుగులోకి వచ్చాయి. వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు? వాటిపై విచార చేసే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి ఉందా? మంత్రి బాలినేని ఇతర రాష్ట్రాలకు హవాలా డబ్బు తరలిస్తూ పట్టుబడితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? బాలినేనిపై ఏసీబీ ఎందుకు కేసు నమోదు చెయ్యలేదు?'' అని ప్రశ్నించారు. 

''కరోనా కిట్లలో ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. దానిపై సీబీఐ విచారణ ఎందుకు జరపలేదు? అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలే కోర్టు లో పిటిషన్ వేశారు. తిరుపతిలో భూకుంభ కోణం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇళ్ల స్థలాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వీటిపై ఎందుకు విచారణ జరిపించరు?'' అని నిలదీశారు. 

''వైసీపీ నేతలు రాష్ట్రంలోని దేవాలయ భూములు, హుండీల్లోని డబ్బులు కూడా కొట్టేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.  దానిపై కూడా  విచారణ జరిపించే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి ఉందా?  ప్రభుత్వానికి చిత్తశుద్ధి, వైసీపీ పార్టీకి సిగ్గు అనేది ఉంటే ముందు వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి'' అని పేర్కొన్నారు. 

''వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి ని కప్పిపుచ్చుకునేందుకే రోజుకో అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప15 నెలల పాలనలో రాష్ట్రంలో  మీరు  చేసిన అభివృది ఏంటి? హోదా గురించి ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా?   కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని వేల కోట్ల నిధులు తెచ్చారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి?'' అని కిమిడి కళా వెంకట్రావు అడిగారు.