అవినీతి, ఆర్థిక  నేరాల కేసులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో సీఎం జగన్ కు భయం పట్టుకుందని టీడీపీ నేత యనమల రామ కృష్ణుడు పేర్కొన్నారు. గురువారం ఆయన  మీడియాతో మాట్లాడారు. దేశంలోని హైకోర్టుల నుంచి ఈ తరహా కేసుల కార్యచరణ కూడా సుప్రీం కోర్టు సిద్ధం చేయనుందని గుర్తు చేశారు. దేశంలో 4వేల కేసులు పెండింగ్ లో ఉంటే అందులో 2500 కేసులు రాజకీయ నేతలవేనని వివరించారు. వీటిలో 12 ఛార్జ్ షీట్స్ సీబీఐ కోర్టులో జగన్ పై దాఖలు చేసినవేనని ఆయన పేర్కొన్నారు.

జగన్ విచారణకు భయపడి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే మంత్రివర్గ ఉప సంఘం, ఏసీబీ విచారణలు తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపచంలో ఎక్కడా లేనివిధంగా గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై విచారణ అనడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. అది చట్ట వ్యతిరేకం కాబట్టే హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామన్న ఆయన పత్రికా హక్కుల గురించి ప్రకటన ఇచ్చే ముందు సజ్జల రామకృష్ణా రెడ్డి ఒకటికి రెరండు సార్లు ఆలోచించాలని హితవు పలికారు.