కేంద్రమంత్రి గడ్కరీ ఆదేశాలతోనే... ఆ గుడులపై..: అచ్చెన్న సంచలనం
రాష్ట్ర బీజేపీ మాపై నిందలు మాని గుడుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు సూచించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నిలదీశారు. కేంద్రానికి దేవాలయాల విషయంలో బాధ్యత లేదా?అని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే స్పందించి ఏపీలో దేవాలయాల ధ్వసంపై సిబిఐ విచారణ జరిపి నిగ్గు తేల్చాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
''రాష్ట్ర బీజేపీ మాపై నిందలు మాని గుడుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. పార్టీ కమిటీ అంటే గుంపులో గోవిందం కాదని... అందరికి ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి'' అన్నారు.
''సీఎం అసెంబ్లీని వైసీపీ కార్యాలయంలా మార్చేశారు. తెలుగు దేశాన్ని నిర్వీర్యం చెయ్యాలని నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఎదురొడ్డి పోరాడుతున్న కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మూడు రాజధానుల విషయంలో అబాసుపాలై సీఎం తోక ముడుస్తున్నాడు'' అని పేర్కొన్నారు.
read more రామతీర్థం జంక్షన్ వద్ద ఉద్రిక్తత: సోము వీర్రాజు సహా బీజేపీ నేతల అరెస్ట్
''జగన్ క్రిస్టియన్ ముఖ్యమంత్రి...డీజీపీ, హోమ్ మంత్రి కూడా క్రిస్టియన్ లే...దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ ఈ ముగ్గురు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రభుత్వ హస్తం ఉంది. వీరు ఒక్క ఘటనను ఎందుకు ఖండించలేదు? 126 ఘటనల్లో ఎందుకు ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదు? ఒక్క ఘటనను తప్పు పట్టలేదు'' అని ప్రశ్నించారు.
''బీజేపీ మాట్లాడితే టీడీపీ నే విమర్శిస్తోంది. విజయవాడలో ఫ్లై ఓవర్ కోసం గడ్కరీ ఆదేశాల మేరకు కొన్ని గుడులు, మసీదులు తొలగించారు. ఆ విషయం తెలీదా... బీజేపీకి చేతలు లేవు...కేవలం ప్రసంగాలే'' అని ఎద్దేవా చేశారు.