హైదరాబాద్: తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు అత్యంత సన్నిహితుడంటూ చెప్పుకొచ్చారు. 

తలసాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడంతో అభినందించేందుకు కలిశానని తెలిపారు. తలసాని తన కుమారుడు పెళ్లికి కూడా హాజరయ్యారని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఏపీ రాజకీయాలపై చర్చించారు. 

అటు తోట త్రిమూర్తులతో భేటీపై తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తన పర్యటనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తాను పర్యటిస్తుంటే చంద్రబాబుకు భయమెందుకు అంటూ చెప్పుకొచ్చారు. తనకు అక్కడ బంధువులు, స్నేహితులు ఉన్నారని తెలిపారు. 

తన నియోజకవర్గంలో ప్రచారం చేసి తనను ఓడిచేందుకు కుట్రలు చేసిన చంద్రబాబుపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పుకొచ్చారు. మరోవైపు హైదరాబాద్ లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారన్న టీడీపీ ఆరోపణలు అర్థరహితమంటూ ఆయన కొట్టిపారేశారు. 

ఇకపోతే కొద్దిరోజులుగా టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తోట త్రిమూర్తులకు అత్యంత సన్నిహితంగా ఉండే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లు పార్టీ వీడటంతో ఆయన కూడా వారి బాటలోనే పయనించనున్నారని ప్రచారం జరుగుతుంది. 

అయితే ఆ ప్రచారంపై తోట త్రిమూర్తులు స్పందించారు. తాను టీడీపీ వీడేది లేదని ప్రస్తుతానికి తెలుగుదేశం ప్రభుత్వంపై సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు కొన్ని నియోజకవర్గాలను ప్రభావితం చెయ్యగల నాయకులకు ఆయా పార్టీలు ఆహ్వానాలు అందిస్తాయని అందులో పెద్ద వింతేమీ లేదంట వేదాంతం చెప్పుకొచ్చారు. 

తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలు డిమాండ్లు పెట్టారని తెలుస్తోంది. తోట త్రిమూర్తులు కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ లేదా కాకినాడ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారని అలాగే తనయుడు పృథ్వీరాజ్ కు రామచంద్రాపురం టికెట్ అడుగుతున్నారని తెలుస్తోంది. టికెట్లపై హామీ వస్తే తోట త్రిమూర్తులు గోడ దూకేందుకు రెడీ గా ఉన్నారని తెలుస్తోంది.