టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వేటు విషయంలో ఏపి టిడిపి నేతలు పట్టుదలగా ఉన్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమొస్తోంది. చంద్రబాబునాయడు విదేశీ పర్యటనలో ఉండగా ఏపి టిడిపి నేతల బండారాన్ని రేవంత్ బట్టబయలు చేసిన సంగతి అందరకీ తెలిసిందే.
టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వేటు విషయంలో ఏపి టిడిపి నేతలు పట్టుదలగా ఉన్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమొస్తోంది. చంద్రబాబునాయడు విదేశీ పర్యటనలో ఉండగా ఏపి టిడిపి నేతల బండారాన్ని రేవంత్ బట్టబయలు చేసిన సంగతి అందరకీ తెలిసిందే.
తెలంగాణా సిఎం కెసిఆర్ తో టచ్ లో ఉంటూ ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఏపి మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత తో పాటు ఎంఎల్సీ పయ్యావుల కేశవ్ విషయాన్ని బహిరంగంగా ప్రకటించటంతో టిడిపిలో ఒక్కసారిగా ముసలం మొదలైంది.
దాదాపు వారం క్రితం మొదలైన ముసలం చివరకు రేవంత్ ను పార్టీ నుండి సాగనంపటానికి రంగం సిద్దం అయ్యేదాకా సాగుతోంది. చూడబోతే చంద్రబాబు విదేశాల నుండి తిరిగి రాగానే అంటే 27వ తేదీనే రేవంత్ విషయంలో ఏదో ఓ నిర్ణయం తీసుకునేట్లే కనబడుతున్నారు. రేవంత్ ను పార్టీ నుండి బయటకు పంపాలన్న ఆలోచన వెనుక ఏపి టిడిపి నేతల హస్తమే ప్రధానంగా ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే, కెసిఆర్ తో తమకున్న సంబంధాలను ఇంతకాలం పలువురు ఏపి టిడిపి నేతలు బయటపడకుండా చూసుకున్నారు. అటువంటిది ఒక్కసారిగా రేవంత్ ఏకంగా ముగ్గురి విషయం బట్టబయలు చేయటంతో మిగిలిన నేతల్లో టెన్షన్ మొదలైంది. రేవంత్ గనుక పార్టీలోనే ఉంటే తమకు మరింత ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతోనే రేవంత్ ను బయటకు పంపేందుకు కీలక నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ రేవంత్ టిడిపి నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత తమ గురించి మాట్లాడినా అవి కేవలం ఆరోపణలు క్రింద తీసిపారేయొచ్చన్నది పలువురు భావన. టిడిపిలోనే ఉంటూ ఆరోపణలు చేయటం వేరు, పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆరోపణలు చేస్తే ఇంకోరకంగా ఉంటుంది కదా? ఆ విషయంపైనే పలువురు నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
