Asianet News TeluguAsianet News Telugu

రోజులు దగ్గరపడ్డాయి... ఆ ఉప్పెనలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం: అచ్చెన్న హెచ్చరిక

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఫ్రభాకర్ అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. 

AP TDP Chief Kinjarapu Atchannaidu Reacts on Chintamaneni Arrest
Author
Amaravati, First Published Aug 30, 2021, 10:55 AM IST

అమరావతి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ పై ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించింది చింతమనేని కాదు... టీడీపీ శాంతియుత నిరసనలకు ప్రభుత్వమే ఆటంకం కలిగించిందన్నారు. ఈ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని... తక్షణమే చింతమనేనిని విడుదల చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. 

''ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం మంటగలిసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న టీడీపీ నేతలను వేధించి అక్రమంగా జైలుపాలు చేయడమే ధ్యేయంగా జగన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకులేదా?పెంచిన ధరలు తగ్గించడమనడం నేరమా?'' అని ప్రశ్నించారు. 

''శనివారం టీడీపీ నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు విజయవంతమయ్యాయి. దీంతో కడుపుమండిన సీఎం జగన్ టీడీపీ నేతలను అరెస్ట్ చేసి అక్కసు తీర్చుకుంటున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య.  పౌరస్వేచ్ఛను ఎంతకాలం తొక్కిపెడతారు? విశాఖలో వివాహానికి వెళ్లిన చింతమనేనిని అక్కడికి వెళ్లి మరీ అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ప్రతిపక్షంలో వుండగా జగన్ 13 జిల్లాల్లో చేపట్టిన పాతయాత్రను మేము అడ్డుకుని ఉంటే నేడు మీ పరిస్థితి ఏంటి?'' అని నిలదీశారు. 

read more  ఏజెన్సీ ప్రాంతంలో అలజడి... అనుమానాస్పద కదలికలు: చింతమనేని అరెస్ట్ పై విశాఖ ఎస్పీ కార్యాలయం

''ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం హేయం. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న మృగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో దళిత విద్యార్థిని నరికి చంపితే నిందితుణ్ణి పట్టుకోలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల కోసం పోరాడుతున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దేనికి సంకేతం?'' అంటూ మండిపడ్డారు.

''గడిచిన రెండున్నరేళ్లలో చింతమనేని ప్రభాకర్ పై 30కి పైగా అక్రమ కేసులు బనాయించారు. అక్రమ కేసుల ద్వారా అణిచివేయాలని చూస్తే టీడీపీ మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ ఉప్పెనలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం'' అని అచ్చెన్న హెచ్చరించారు. 

''తనను పొగిడిన ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరిస్తుంటే... తనను విమర్శిస్తే అరెస్ట్ లు తప్పవని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి నియంతపాలనకు రోజులు దగ్గరపడ్డాయి. వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులకు భయపడం. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం. అక్రమంగా అరెస్ట్ చేసిన చింతమనేని ప్రభాకర్ ను తక్షణమే విడుదల చేయాలి... లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతాం'' అని అచ్చెన్నాయుడు అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios