గుంటూరు:  రాష్ట్రంలో ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా భాద్యతాయుతమైన పదవుల్లో వున్న వైసిపి నాయకులే ప్రభుత్వ నిబంధనలను ఉళ్లంఘిస్తున్నారని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించకుండా కొందరు వైసిపి  ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని  ఒక జిల్లా నుండి మరో జిల్లాకు తిరుగుతుంటే ఓ మంత్రి ఏకంగా  పక్క రాష్ట్రానికి వెళ్లి తిరిగివస్తున్నారని ఆరోపించారు. వారిని ఎందుకు క్వారంటైన్ కేంద్రాలకు పంపించడంలేదని కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఈ మేరకు ప్రశ్నలు సంధిస్తూ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు.  

సీఎం జగన్ కు కళా వెంకట్రావు రాసిన బహిరంగ లేఖ యధావిధిగా... 

గౌ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గార్కి.

 విషయం : మాస్కులు, శానిటైజర్ల తయారీ బాధ్యతలు డ్వాక్రా సంఘాలకు అప్పగించండి – లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నాయకులపై చర్యలు – అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ- అన్నార్తులకు సాయం చేసేందుకు వచ్చిన వారికి ప్రభుత్వం తరపున భరోసా కల్పించాలి.

రాష్ట్రంలో కరోనా వైరస్ కన్నా వైసీపీ వైరస్ ప్రమాదకరంగా మారిందని ప్రజలు భయపడుతున్నారు. దేశమంతా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నా.. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులపై దౌర్జన్యం చేసి రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నారు. క్వారంటైన్ కేంద్రాలను పోలింగ్ బూత్ లుగా మార్చి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో యధేచ్ఛగా తిరుగుతున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఊరేగింపుతో కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్‌గౌడ్‌ లాక్‌ డౌన్‌ నిబంధనలను తుంగలో తొక్కి, విపత్కర సమయంలో వందల మందిని పోగేసుకుని కల్వర్టు ప్రారంభోత్సవం చేశారు. 

మంత్రి ఆదిమూపు సురేష్‌ కరోనా నిబంధలను ఉల్లంఘించి పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లి, తిరిగి ఏపీకి వచ్చారు. వారిని ఎందుకు క్వారంటైన్ కు తరలించలేదు.? ఎందుకు చర్యలు తీసుకోలేదు. కానీ పేదలకు, వృద్ధులకు పళ్లు, కూరగాయలు, బియ్యం వంటి నిత్యావసరాలు ఇచ్చేందుకు వచ్చిన స్వచ్ఛంద సంఘాలు, ప్రజా సంఘాలపై వారిపై అధికారులు, వైసీపీ నేతలు వేధింపులకు పాల్పడుతున్నారు. పేదలకు అన్నం పెట్టేందుకు వస్తుంటే సవాలక్ష నిబంధనలు విధించి ఇబ్బంది పెడుతున్నారు. 

వైసీపీ నాయకులు గుంపులుగా వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాజకీయ లబ్ది కోసం వాడుకుంటూ స్వచ్ఛంద సంస్థలను బెదిరించడం దుర్మార్గం కాదా.? లాక్ డౌన్ నిబంధనలు వైసీపీ నేతలకు వర్తించవా.? భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా పర్యటించొచ్చా..? సేవ చేయాలని ముందుకొచ్చిన ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్ష సభ్యులు భౌతిక దూరం పాటిస్తున్నా.. రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం, అడ్డుకోవడం ఎంత వరకు సబబు.? కష్ట సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చిన వారి కాళ్ల మధ్య కర్రలు పెట్టి వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతుంటే.. మీకు కనిపించడం లేదా.?రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున మొత్తంగా 16 కోట్ల మాస్కుల తయారీ బాధ్యతలను డ్వాక్రా మహిళలకే అప్పగించాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.  

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 36 వేల డ్వాక్రా సంఘాల్లోని 98 లక్షల మంది మహిళలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా మిషన్లను ఉచితంగా పంపిణీ చేసి శిక్షణ ఇప్పించాం. నేడు వారి సేవలను వాడుకోవడం ద్వారా వారికి ఆర్ధిక పరిపుష్టి, రాష్ట్రానికి త్వరతగతిన పని జరుగుతుంది.  వారికి మాస్కుల తయారీతో పాటు శానిటైజర్ల తయారీ బాధ్యతలు కూడా అప్పగించండి. అవసరమైన ముడి సరుకును ప్రభుత్వం తరఫున సరఫరా చేయాండి. 

కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నందున ఈ బాధ్యతలు వారి జీవనోపాధికి ఎంతో అండగా నిలుస్తుంది. దేశానికే బలమైన ఆర్ధిక వ్యవస్థ మన మహిళా సంఘాలని ప్రభుత్వం గుర్తించాలి. టైలర్ల అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నవారికి కూడా ఈ మాస్కుల తయారీలో భాగస్వామ్యం కల్పించండి. తద్వారా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న టైలర్లకూ ఉపాధి కల్పించినట్లు అవుతుంది.కేరళలో వయో వృద్ధులకు రాయితీపై భోజనం అందించే బాధ్యతలను గ్రామాల్లో డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. మన రాష్ట్రంలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని మహిళా సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. 

ప్రస్తుతం ఉన్న అన్న క్యాంటీన్లను పున:ప్రారంభించండి. అవసరమైన ప్రాంతాల్లో మహిళా సంఘాలతో మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేయించండి. అప్పుడే అన్నార్తుల ఆకలి కేకలు తప్పుతాయి. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలు, కార్మికులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆహార పదార్ధాలు అందించేందుకు వచ్చిన వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ కారణాలు వెతుక్కోవడం సరికాదు. రాష్ట్ర ప్రజల ఆకలి తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై ఉందని గుర్తించండి.


                                                                                                                                                                                                                         (కిమిడి కళా వెంకట్రావు)
                                                                                                                                                                                                                తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు