అమరావతి: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో కర్రి అరుణ కుమారి అనే మహిళ ఆత్మహత్యకు కారకులైన స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఏపి టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు రాష్ట్ర డీజీపీకి ఆయన లేఖ రాశారు. 

''కర్రి అరుణకుమారి ఆత్మహత్య ముమ్మాటికి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బాధ్యత వహించాలి.  ఇటువంటి ఘటనలు మరో సారి పునరావృతం కాకుండా అనపర్తి శాసనసభ్యునిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.  లేకుంటే ఇలాంటి సంఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశంలోను ప్రజలనే కాదు వైసీపీ కార్యకర్తలను సైతం మోసం చేస్తూ వచ్చింది.  ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలకు ఇప్పటికే అనేక మంది వైసీపీ కార్యకర్తలు, ప్రజలు బహిరంగంగా భయటకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వెంటనే చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం'' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.