వైసీపీ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో 22 మంది గొర్రెలను ప్రజలు గెలిపించారని.. వాళ్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడట్లేదని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజలు ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని అచ్చెన్నాయుడు చెప్పారు. వైసీపీ డబ్బు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొండమీద కూర్చొన్న జగన్మోహన్‌రెడ్డి పొగరు దించాలంటే తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ గెలిచి తీరాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రేపు ఉదయం టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ నామినేషన్‌ వేస్తున్నారని ఆయన తెలిపారు.

సంక్షేమ కార్యక్రమాల పేరిట వైసీపీ ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి.. ప్రజల నుంచి 100 రూపాయలను లాగేసుకుంటోందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు వంటి అంశాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ తరపున మూడు పులులు ఉన్నాయని... ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో నిరంతరం మూడు పులులు గళం విప్పుతున్నాయని అదనంగా మరో పులిని చేర్చండి అంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.