విశాఖలో భూముల అమ్మకాలను ప్రశ్నించినా, వైసిపి నాయకుల అక్రమాలను అడ్డుకున్నా దాడులకు పాల్పడతారా? అని సీఎం జగన్ ని అచ్చెన్నాయుడు నిలదీశారు. 

విశాఖపట్నం: ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో ప్రభుత్వం విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖలో భూముల అమ్మకాలను ప్రశ్నించినా, వైసిపి నాయకుల అక్రమాలను అడ్డుకున్నా దాడులకు పాల్పడతారా? అని నిలదీశారు. సెలవు దినాల్లో విధ్వంసం అనే కొత్త పథకానికి జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన స్థలంలో అధికారులు ఇష్టారీతిన ఫెన్సింగ్ తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన భూముల విషయంలో ప్రభుత్వ అధికారులు పరిశీలించి అంతా సక్రమంగా ఉండడంతో ఏమీ చేయలేక యాదవ జగ్గరాజుపేట చెరువుకు చెందిన 2 అడుగుల స్థలం ఆక్రమించారంటూ ఫెన్సింగ్ తీసివేయడం అమానుషం. ఆక్రమణలు ఉంటే జాయింట్ సర్వే నిర్వహించి వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేశారు. 

read more త్వరలోనే విశాఖ భూఆక్రమణలపై సిట్ నివేదిక: మంత్రి అవంతి

''ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదు. ప్రశ్నిస్తే వేధింపులు, అక్రమాలను అడ్డుకుంటే విధ్వంసాలా? వైసీపీ నేతల రాక్షసత్వం రోజురోజుకీ పెరిగిపోతోంది. విద్వేషం, విధ్వంసంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల ఆస్తులను ధ్వంసం చేస్తూ జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. పల్లా శ్రీనివాసరావు ఆస్తులపై దాడులు బలహీనవర్గాలపై దాడులు చేయడమే'' అన్నారు. 

''తప్పులు చేసిన వైసీపీ నేతలపై చర్యలు లేవు. అక్రమాలను ప్రశ్నిస్తే విధ్వంసాలా? విశాఖలో సబ్బం హరి, వెలగపూడి రామకృష్ణ , గీతం విద్యాసంస్థలపై దాడులు చేసి భయోత్పాతాలు సృష్టించారు. జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో కట్టింది ఒక్కటి లేదు కానీ.. కూల్చివేతలకు మాత్రం లెక్కలేదు. ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రలో విద్వేషాలు, విధ్వంసాలను రెచ్చగొడుతున్న వైకాపా నేతలకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.