త్వరలోనే విశాఖ భూఆక్రమణలపై సిట్ నివేదిక: మంత్రి అవంతి
మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యుఎల్‌సీ భూములను ఆక్రమించారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఈ భూముల విలువ రూ. 200 కోట్లు ఉంటుందన్నారు.
విశాఖపట్టణం: మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యుఎల్‌సీ భూములను ఆక్రమించారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఈ భూముల విలువ రూ. 200 కోట్లు ఉంటుందన్నారు. ఆదివారం నాడు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూముల్ని ఎవరూ ఆక్రమించినా ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుందని ఆయన తేల్చి చెప్పారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖలో భూములను విక్రయించి వచ్చిన డబ్బును హైద్రాబాద్ లో ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. విశాఖలో భూముల విక్రయంతో వచ్చిన డబ్బులను విశాఖలో ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
భూముల ఆక్రమణలకు పాల్పడిన ఎవరిని కూడ వదలిపెట్టబోమని మంత్రి తేల్చి చెప్పారు. టీడీపీ నేతల భూ ఆక్రమణలపై చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం సామాన్యులను కాపాడే ప్రభుత్వమని ఆయన చెప్పారు. పల్లా కుటుంబం ఆక్రమణలో ఉన్న 48 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవాళ స్వాధీనం చేసుకొన్నట్టుగా మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమణలపై సిట్ దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే సిట్ నివేదిక రానుందని ఆయన చెప్పారు.