ఆంధ్రప్రదేశ్ కి ‘‘ పెథాయ్’’ పేరిట మరో తుఫాను గండం పొంచి ఉంది. బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ పెథాయ్  తుఫానును  ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ తుఫాను కారణంగా ఎక్కువ నష్టం వాటిల్లకుండా.. ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

ఈ చర్యలపై సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తుఫాను ప్రభావ పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట తుఫాను సంబంధిత విభాగాల అధికారలుు ఆర్టీజీఎస్ లో ఉండాలని ఆదేశించారు. ఆయాశాఖల అధికారులు ఆర్టీజీఎస్ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీంతో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. 

పెథాయ్ తుఫాను ప్రస్తుతం కృష్ణాజిల్లా మచిలీపట్నానికి 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

తుఫాను తీవ్రత దృష్ట్యా ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావం తెలంగాణపైనా పడింది. రాజధాని హైదరాబాద్‌లో అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. 16, 17 కోస్తాంధ్రాపై పెథాయ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.