గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. గుంటూరులో మీడియాతోమాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులకు తెగబడిందని ఆరోపించారు. 

తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూలేని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఏం చెబితే కేంద్ర ఎన్నికల సంఘం అది చేస్తోందని కోడెల ఆరోపించారు. 

ఈసీ అధికారాలను వినియోగించి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకమైన ఎన్నికలు జరిపించిందన్నారు. ఎన్నికలకు, ఓట్ల లెక్కింపునకు 42 రోజుల గడువు ఉండటం బాధాకరమన్నారు. కేంద్రప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలు సమీక్షలు నిర్వహించుకుంటున్నాయని కానీ ఏపీలో సమీక్షలు చేస్తే తప్పంటున్నారని విమర్శించారు. కేంద్రంలో, తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలో ఎందుకు అని స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిలదీశారు.